Share News

పటిష్ట నిఘా

ABN , Publish Date - Dec 04 , 2025 | 11:40 PM

గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేలా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.

పటిష్ట నిఘా

- పల్లెపోరు నేపఽథ్యంలో జిల్లాలో చెక్‌పోస్టుల ఏర్పాటు

- తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసుశాఖ

- సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా

- మద్యం, డబ్బు తరలింపుపై దృష్టి

ఆసిఫాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేలా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఓటర్లను ప్రలోభ పెట్ట్టే మద్యం, డబ్బు, ఇతర సామగ్రి జిల్లాలోకి రవాణ కాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో నిరంతరంగా తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. జిల్లాలో మూడు దశల్లో ఈనెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే తొలి, మలివిడతల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, తుది విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సరిహద్దుల్లో మూడు చెక్‌పోస్టుల ఏర్పాటు..

జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డివిజన్ల నుంచి మహారాష్ట్రకు రవాణా మార్గాలు ఉన్నాయి. వాంకిడి, సిర్పూర్‌-టి మండలం పోడ్సా, మాకిడి, చింతలమానేపల్లి మండలం గూడెం నుంచి మహారాష్ట్రలోని గ్రామాలకు వెళ్లొచ్చు, పోడ్సా, గూడెం వద్ద పెనుగాంగ, ప్రాణహిత నదులు సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు వాంకిడి మండలంలోని జాతీయ రహదారిపై, సిర్పూర్‌-టి మండలంలోని వెంకట్రావ్‌పేట, దుబ్బగూడ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఒక్కో చెక్‌పోస్టులో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ లేదా జీసీవోలు ఇద్దరు, మరో ఇద్దరు ఏఎస్‌ఐలు, లేదా పోలీసు సిబ్బంది, వీడియోగ్రాఫర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల చెక్‌ పోస్టులతో పాటు చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద అక్రమ రవాణా నియంత్రణకు చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఇటీవల సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎస్పీ నితిక పంత్‌ తనిఖీ చేశారు. అలాగే మండలాల పరిధిలో ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది సైతం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..

జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే సమస్యాత్మక, నెట్‌వర్క్‌లేని పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి పోలింగ్‌ రోజు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేశారు. నెట్‌వర్క్‌లేని పోలింగ్‌ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను, సాధారణ పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ ఆధారంగా పోలింగ్‌ సరళిని పర్యవేక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 335 పంచాయతీల్లో 2,874 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెట్‌వర్క్‌ లేని, సరైన రహదారులు లేని, మావోయిస్టు ప్రాభల్యం ఉన్న మారుమూల గ్రామాల్లో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. వీటిలో 151 పంచాయతీల పరిధిలో 1,346 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 57 పంచాయతీల పరిధిలో 342 కేంద్రాల్లో నెట్‌వర్క్‌ లేనట్లు గుర్తించారు. వీటిలో ఒక్కదానిలో ఒక సూక్ష్మ పరిశీలకుడిని నియమించారు. 101 పంచాయతీల పరిధిలోని 1,004 కేంద్రాలలో నెట్‌వర్క్‌ ఉండడంతో వాటిలో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళీ పరిశీలించనున్నారు.

Updated Date - Dec 04 , 2025 | 11:40 PM