Share News

నేలవాలిన ఆశలు

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:12 PM

జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపిలేని భారీ వర్షం కురుస్తోంది. మొంథా తుపాన్‌ ప్రభావం కారణంగా బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన వర్షం గురువారం కూడా కొనసాగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలో 42.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.

నేలవాలిన ఆశలు

- మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌తో జిల్లాలో భారీ వర్షాలు

- 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

- ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద

- 23 గేట్ల ద్వారా గోదావరిలోకి నీరు విడుదల

- ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం

- మూడు వేల ఎకరాల్లో పంటలకు నష్టం

మంచిర్యాల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపిలేని భారీ వర్షం కురుస్తోంది. మొంథా తుపాన్‌ ప్రభావం కారణంగా బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన వర్షం గురువారం కూడా కొనసాగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలో 42.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గరిష్టంగా బెల్లంపల్లి మండలంలో 70.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా, జైపూర్‌ మండలంలో 69.4 మిల్లీమీటర్లు, మంచిర్యాల జిల్లా కేంద్రంలో 68.6 మిల్లీమీటర్లు, హాజీపూర్‌ మండలంలో 64.8 మిల్లీమీటర్లు, నస్పూర్‌లో 58.0 మిల్లీమీటర్లు, చెన్నూరు మండలంలో మిల్లీమీటర్లు, భీమారం మండలంలో 45.6 మిల్లీమీటర్లు, వేమనపల్లి మండలంలో 44.0 మిల్లీమీటర్లు, కాసిపేట మండలంలో 41.2 మిల్లీమీటర్లు, కోటపల్లి మండలంలో 34.2 మిల్లీమీటర్లు, తాండూరు మండలంలో 32.8 మిల్లీమీటర్లు,, కన్నెపల్లి మండలంలో 32.6 మిల్లీమీటర్లు, నెన్నెల మండలంలో 32.4 మిల్లీమీటర్లు, భీమిని మండలంలో 29.6 మిల్లీమీటర్లు, మందమర్రి మండలంలో 29.0 మిల్లీమీటర్లు, లక్షెట్టిపేట మండలంలో 29.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద...

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట మట్టం 148.00 మీటర్లు కాగా, ప్రస్తుతం 147.43 మీటర్లకు నీరు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలుకాగా ప్రస్తుతం 18.591 టీఎంసీల నీరు ఉంది. ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి 5000 వేల క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 36,680 క్యూసెక్కులు, స్థానికంగా కురుస్తున్న వర్షాల కారణంగా మరో 1,17,724 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో 23 గేట్లు తెరిచి 2,04,404 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది.

- ఓసీపీల్లో బొగ్గు తవ్వకాలకు ఆటంకం...

రెండు రోజులుగా ఎడతెరపి కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్లలోని ఓపెన్‌ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలకు కొంతమేర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఓబీ మట్టి తొలగింపు పనులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. క్వారీల్లో నీరు నిలిచిపోవడంతో పనులు జరగడం లేదు. దీంతో యంత్రాల సహాయంతో నీటిని తోడుతున్నారు.

- లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు....

భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో వరదనీరు చేరుతోంది. గేట్లు తెరిచి నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలు ఇలాగే కొనసాగితే గోదావరి ఉగ్రరూపం దాల్చి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్‌ నగర్‌, రాంనగర్‌, పద్మశాలి కాలనీ, ఆదిత్య ఎన్‌క్లేవ్‌ ఏరియాలోని ఇళ్లలోకి వరద నీరు చేరే అవకాశాలు ఉన్నాయి.

మూడు వేల ఎకరాల్లో పంట నష్టం...

రెండు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని రైతులకు తీరని నష్టం వాటిల్లింది. జిల్లాలోని 128 గ్రామాల్లోని 2,751 మంది రైతులకు చెందిన వరి, పత్తి పంటలు 3,351 ఎకరాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందులో 2,563 ఎకరాల్లో వరి పంట నీట మునగగా, 788 ఎకరాల పత్తికి నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

- నేలవాలిన వరి..తడిసిన పత్తి..

చెన్నూరు: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తుఫాన్‌ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని ఓత్కులపల్లి, ఎర్రగుంటపల్లి, అంగ్రాజ్‌పల్లి, కిష్టంపేట, లింగంపల్లి, కొమ్మెర, పొక్కూరు గ్రామాల్లో చేనులో ఉన్న పత్తి పంట తడిసిపోయి నల్లబారుతుంది. అలాగే నాగాపూర్‌, అక్కెపల్లి, చింతలపల్లి, శివలింగాపూర్‌ గ్రామాల్లో వరి పంట వర్షాలకు నేలకొరిగింది. సుమారు వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వర్షాలు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

జైపూర్‌: తుఫాన్‌ దృష్ట్యా మండలంలో రెండు రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మండల కేంద్రంతో పాటు నర్వా, ముదిగుంట, ఇందారం, రసూల్‌పల్లి, మిట్టపల్లి, రామారావుపేట, టేకుమట్ల, శెట్‌పల్లి, ఇందారం, కిష్టాపూర్‌, వేలాల, పౌనూరు, శివ్వారం గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. పత్తి తడిసి ముద్ద అయ్యింది. పత్తి రంగు మారే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. పొలాల్లో నీరునిలిచి చెరువులను తలపిస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వ్యవసాయాధికారులు స్పందించి పంట నష్టం సర్వే చేసి నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

బెల్లంపల్లి: పట్టణంతో పాటు మండలంలో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర ్షం కురిసింది. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో చేతికి వచ్చిన పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే పట్టణంలోని పలు రహదారుల పైనుంచి వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోని 31వవార్డులోని మహ్మద్‌ ఖాసీం బస్తీలో వర్షాల కారణంగా నాగమల్ల సోమయ్య ఇంటి పైకప్పు కూలింది. కాంగ్రెస్‌ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఎమ్మెల్యే వినోద్‌తో మాట్లాడి బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విన్నవించారు. దీంతో ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు.

హాజీపూర్‌/భీమారం: హాజీపూర్‌, భీమారం మండలాల్లో వరి, పత్తి పంటలకు తీవ్ర నష్ఠం వాటిల్లింది. కోత దశలో ఉన్న వరి పంటలు నేల వాలాయి. మడుల్లో నీరు చేరడంతో పైరు కింద పడడంతో వడ్లు మొలకలు వచ్చే పరిస్థితి నెలకొంది. పత్తి ఏరే దశలో ఉండడంతో వర్షాలకు నేల రాలుతోంది. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలకు ఇప్పటికే వడ్డీలు కట్టలేని స్ధితిలో ఉన్నామని, ఇక తుఫాను తెచ్చిన నష్టంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్ధితుల్లో ఉన్నామని, నష్టపోయిన పంటలను అధికారులు సర్వే చేసి న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Updated Date - Oct 30 , 2025 | 11:13 PM