Share News

ఎట్టకేలకు మోక్షం

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:31 PM

రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలకు ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్‌ సర్కారు సన్నద్ధం అవుతోంది. సహకార సంఘాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీతో ముగిసింది. అయితే వివిధ కారణాల చేత ప్రభుత్వం రెండు దఫాలుగా ఆరు నెలల వ్యవధితో కూడిన గడువు పెంచింది.

ఎట్టకేలకు మోక్షం
జన్నారంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార భవనం

- సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధం

- ముగిసిన డీసీసీబీ, పీఏసీఎస్‌ల పదవీకాలం

- ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం

- కొత్త మండలాల్లో ఏర్పాటుకానున్న పీఏసీఎస్‌లు

మంచిర్యాల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలకు ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్‌ సర్కారు సన్నద్ధం అవుతోంది. సహకార సంఘాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీతో ముగిసింది. అయితే వివిధ కారణాల చేత ప్రభుత్వం రెండు దఫాలుగా ఆరు నెలల వ్యవధితో కూడిన గడువు పెంచింది. మొదటి దఫాలో ఆరు నెలల వ్యవధి పెంచడంతో ఆగస్టు 15వ తేదీతో ముగిసింది. మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లెక్కన 2026 ఫిబ్రవరి 15వ తేదీతో ఆ గడువు ఉండగా, రెండు నెలల ముందుగానే డీసీసీబీ (డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌), పీఏసీఎస్‌ (ప్రైమరీ అగ్రికల్చరల్‌ క్రెడిట్‌ సొసైటీ) చైర్మన్‌ల పదవీ కాలాన్ని ముగిస్తూ ఈనెల 19న జీవో జారీ చేసింది. అదే సమయంలో రైతులకు వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) విస్తరణపైనా ప్రభుత్వం ధృష్టి సారించనుంది. రైతులకు పంట రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు అందిస్తూ అండగా నిలవడం సహకార సంఘాల విధి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జిల్లాలో కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చినా...అవి బుట్టదాఖలు కావడంతో విస్తరణకు నోచుకోలేదు. కొత్తవి ఏర్పాటు చేయకపోయినా...కనీసం ఉన్నవాటిని కూడా బలోపేతం చేయకపోవడంతో రైతులకు వాటి సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సంఘాల పరిధి ఎక్కువగా ఉండటంతోపాటు గ్రామాలకు దూరంగా ఉండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మండలాల్లో సహకార సంఘాలు లేకపోవడంతో ఆయా మండలాల రైతులు ఇతర మండలాల్లోని సొసైటీలకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో కొన్ని సొసైటీల పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉండగా, మరికొన్ని సొసైటీలకు తక్కువ గ్రామాలు ఉన్నాయి. దీంతో దూరంగా ఉన్న సొసైటీలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

- విస్తరణపైనా ప్రభుత్వం దృష్టి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత జిల్లాలు, మండలాల పునర్విభజన జరిగిన అనంతరం ఆ మేరకు రైతులకు సహకార సేవలను మరింతగా పెంచేందుకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సహకార సంఘాల విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు సహకార శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అధికారులు క్షేత్రస్థాయిలో అద్యయనం చేసి, గ్రామాల్లో సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను కూడా సేకరించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న సహకార సంఘాలకు అదనంగా ఎన్ని అవసరం అవుతాయో అంచనా వేసి ప్రతిపాదనలు తయారు చేశారు. సంబంధిత నివేదికలను ప్రభుత్వానికి పంపారు. దీంతో సహకార సంఘాల విస్తరణకు రంగం సిద్ధంకాగా, డ్రాఫ్టు నోటిఫికేషన్‌ కూడా జారీ అయింది. సహకార సంఘాల విభజనే తరువాయి అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయం మరుగున పడింది. చివరిసారిగా 2020 ఫిబ్ర వరి 15న ప్రభుత్వం సహకార ఎన్నికలను నిర్వహించింది. ఎన్నికల సమయం లోనే సంఘాలను విస్తరించాలని ప్రతిపాదించగా, అప్పటి ప్రభుత్వం పట్టించు కోకపోవడంతో విస్తరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే రైతుల ప్రయో జనాలను దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్‌ సర్కారు పీఏసీఎస్‌లను విస్తరించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే డీసీసీబీ, పీఏసీఎస్‌ చైర్మన్ల పదవీకాలా న్ని ముగించడంతోపాటు కొత్తసంఘాలను నియమించేందుకు సన్నద్ధం అవుతోంది.

- నూతన సహకార విధానానికి మంగళం....

సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ సహకార విధానానికి శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం ప్రతి గ్రామాని కి ఒక ప్రాథమిక సహకార సంఘం, ఒక మత్స్య సహకార సంఘం, ఒక పాల ఉత్పత్తి సహకార సంఘం ఉండాలనేది ఈ నూతన సహకార విధానం ఉద్దే శం. కేంద్ర సహకార శాఖ మంత్రిగా అమిత్‌షా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏర్పాటు చేసిన జాతీయ సహకార సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా రు. నూతనవిధానాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు కూడా అమిత్‌ షా సూచన లు చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోవడంతో నూత న విధానానికి మంగళం పాడినట్లయింది. ఈ విషయంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

- విభజనతోనే సేవలు విస్తృతం...

వ్యవసాయంలో రైతులకు అన్నిరకాలుగా వెన్నుదన్నుగా ఉండే సహకార సంఘాల సేవలను విస్తరిస్తుండటంతో మరింతగా ప్రయోజనం కలుగుతుం దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కొత్తగా ఐదువేల ఎకరాల కు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఏఈవోలను నియమించింది. అదే తరహాలో రైతులకు అందుబాటులో ఉండేలా సొసైటీలను కూడా విభజించే నిర్ణయానికి రావడం గమనార్హం. ఒక్కో సొసైటీలో వేలాది మంది రైతులు సభ్యులుగా ఉం డగా, ఏ అవసరం వచ్చినా క్యూలు కట్టాల్సి వస్తోంది. ప్రతీ సీజన్‌ ఆరంభంలో ఎరువులు, విత్తనాలకోసం రైతులు బారులు తీరిన సందర్భాలు అనేకం ఉన్నా యి. జిల్లాలో ప్రస్తుతం 21 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండ గా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక డీసీసీబీ ఉంది. వాటి పదవీకాలం ముగియ డంతో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం అనివార్యం అయింది. ప్రభుత్వం సహకార సంఘాలను విస్తరిం చాలనే నిర్ణయానికి వచ్చినందున జిల్లాలో మండలానికో పీఏసీఎస్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న డీసీసీబీని కొత్త జిల్లాల వారీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలో కొత్త పీఏసీఎస్‌లతోపాటు డీసీసీబీ ఏర్పాటైతే ఆయా సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల ఎన్నిక జిల్లాల వారీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని రైతులకు సహకార సంఘాల సేవలు సైతం విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Updated Date - Dec 21 , 2025 | 11:31 PM