Share News

వేతన వెతలు..

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:42 PM

చాలీ చాలని వేతనాలతో నెట్టుకొస్తున్న కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది

వేతన వెతలు..

- మూడు నెలలుగా జీతాల పెండింగ్‌

- ఇబ్బందుల్లో కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): చాలీ చాలని వేతనాలతో నెట్టుకొస్తున్న కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవక అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్‌ను కలిసి విన్నవించారు. నోటీసులు, వినతిపత్రాలు అందిస్తున్నా ఏ నెల కూడా సక్రమంగా వేతనాలు తమకు రావడం లేదని వారు వాపోతున్నారు. ప్రతీసారి పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు పాఠశాలలు ప్రారంభమయినప్పటి నుంచి పుస్తకాలు, దుస్తులు, పాఠశాల ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబపోషణ భారమై నెలవారీ ఇంటి ఖర్చులు, కిరాణా సరుకుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. అలాగే దీంతో పాటు 1.5 కోట్ల రూపాయల పీఎఫ్‌ బకాయిలున్నట్లు కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సంఘం అధ్యక్షుడు శంకర్‌ పేర్కొంటున్నారు. మే నెలలో సమ్మె నోటీసులు అందించి, ఆందోళన చేశామని అప్పుడు ఒక్క నెల వేతనం అందించారన్నారు. తిరిగి జూన్‌, జూలై, ఆగస్టు నెలల వేతనం ఇవ్వాల్సి ఉందని ఎవరూ పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- 196 కుటుంబాలకు నిత్యం నరకమే

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో కాంట్రాక్టు పద్ధతిలో 141 మంది పారిశుధ్య, 55 మంది విద్యుత్‌, మంచినీరు, బిల్లులు వసూళ్లు, కార్యాలయ సిబ్బంది, తదితర పనులు చేస్తున్నారు. వీరికి నెలనెలా వేతనాలు అందకపోవడంతో పాటు జీతాల నుంచి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ కోత విధిస్తున్నారు. కానీ డబ్బులు జమ చేయకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీసారి సమ్మె చేయందే జీతాలు చెల్లించడం లేదు. నిధుల కొరత కారణంగా వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. గతంలోనూ ఈఎస్‌ఐ, పీఎఫ్‌ పేరిట కోత విధించిన డబ్బులు జమ చేయాలని మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. దీంతో కార్మిక కుటుంబాలకు భద్రత కరువైంది.

- భద్రత కరువు

కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ జమ చేయకపోవడం వలన వ్యాధుల బారిన పడిన కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేతనాల్లో కోత విధించిన ఈఎస్‌ఐ కాంట్రిబ్యూషన్‌ నెలవారీగా ఆయా సంస్థలకు చెల్లించాలని ఆందోళన చేసిన ప్రతీ సారి చెప్పినా ఫలితం ఉండడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎస్‌ఐ చెల్లింపులు లేకపోవడంతో కార్మికుల కుటుంబసభ్యులకు చికిత్సకు దూరం అయ్యారని, వెంటనే ఈఎస్‌ఐ, పీఎఫ్‌ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. ప్రతీ యేట ఆందోళన బాట పట్టందే వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందనీ, గణేష్‌ నవరాత్రులు, నిమజ్జనం తదితర పండుగల దృష్ట్యా సమ్మె ఆలోచన విరమించుకోవాలని వారు సూచించడంతో కార్మిక సంఘం నాయకులు వెనక్కి తగ్గారు. రానున్న దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని వెంటనే తమ వేతనాలు మంజూరు అయ్యేలా కృషిచేయాలని కోరుతున్నారు.

సమ్మె చేయందే వేతనాలు ఇవ్వడం లేదు

- ఇరిగిరాల శంకర్‌, అధ్యక్షుడు, తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయు)

ప్రతీ సారి సమ్మె చేయందే వేతనాలు ఇవ్వని పరిస్థితి ఉంది. కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)లకు వినతిపత్రాలు అందించాం. ఎమ్మెల్యేని కలిసి మొరపెట్టుకోగా సీడీఎంఎతో మాట్లాడారు. అదనపు నిధులు మంజూరు చేస్తే తప్ప జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చొరవ తీసుకొని సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి. కుటుంబ పోషణ భారంగా మారింది.

Updated Date - Sep 06 , 2025 | 11:42 PM