రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Dec 20 , 2025 | 10:38 PM
రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.
- మంత్రి పొన్నం ప్రభాకర్
- కలెక్టర్, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, పోలీసు, అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రహదారి భద్రత మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జనవరిలో రహదారుల నియమాలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆర్టీసీ, రవాణా, విద్యా, పోలీసు శాఖలు, జిల్లా రోడ్ సేప్టీ కమిటీల ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, రోడ్డుభధ్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రహదారి భద్రత కోసం రహదారి భద్రత కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ నెల సమావేశం నిర్వహించి ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని వివరించారు. జిల్లాలోని ప్రమాద ప్రాంతాలను గుర్తించి సూచిక బోర్డులు, వేగ నిరోధకాలను ఏర్పాటు చేస్తున్నామన్నామని పేర్కొన్నారు. కొత్త సంవత్సర వేడుకల దృష్య్టా డిసెంబరు 31న స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.