ఆందోళనల మధ్య రహదారి విస్తరణ
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:06 PM
పట్టణంలోని శిశుమందిర్, మార్కెట్ ఏరియాలోని రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలో శనివారం చేపట్టారు.
బెల్లంపల్లి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శిశుమందిర్, మార్కెట్ ఏరియాలోని రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలో శనివారం చేపట్టారు. ఈక్రమంలో ఆటో స్టాండ్‌ను తొలగించవద్దని ఎన్నో ఏళ్లుగా ఆటోస్టాండ్‌ను ఏర్పాటు చేసుకున్నామని ఆటో డ్రైవర్లు మున్సిపల్ కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆటోస్టాండ్ కోసం ఇతర స్థలం కేటాయించకుండానే ఆటో స్థలాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ కమషనర్‌తో వాగ్వాదానికి దిగుతున్న క్రమంలో పోలీసులు ఆటో డ్రైవర్లను పోలీసుస్టేషన్‌కు తరలించారు. శిశుమందిర్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న సమయంలో పలువురు బాధితులు మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగినప్పటికీ రహదారిపక్కన ఉన్న నిర్మాణాలను ఎక్స్‌కావేటర్ సాయంతో కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కౌన్సిలర్లు లక్షల రూపాయలు వసూలు చేశారు
- మున్సిపల్ కమిషనర్‌తో వ్యాపారస్తులు
రహదారి వెడల్పు పనుల విషయంలో పలువురు కౌన్సిలర్లు లక్షల రూపాయలు వసూలుచేశారని వ్యాపారస్తులు మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ దృష్టికి శనివారం తీసుకెళ్లారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పున్నం చందు కమిషనర్‌తో మాట్లాడుతూ పలువురు కౌన్సిలర్లు వ్యాపారస్తులను బెదిరించి నాలుగు లక్షల రూపాయల వరకు వసూలుచేశారని ఈ విషయంపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామన్నారు. రహదారి విస్తరణ పనులను వ్యాపారస్తులకు అన్యాయం కాకుండా చేపట్టాలని కోరారు.