పత్తి కొనుగోళ్లకు సమాయత్తం
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:48 PM
వానాకాలం సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. సీసీఐ ద్వారా జిల్లాలో ఈ సీజన్‌లో మొత్తం 11 సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
- జిల్లాలో 11 సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు
- నవంబరు మొదటివారంలో ప్రారంభంకానున్న కొనుగోళ్లు
-గత ఏడాదితో పోల్చితే దిగుబడి తగ్గుతుందని అంచనా
- అతివృష్టి, యూరియా కొరతే కారణం
- మద్దతు ధరపైనా రైతుల అసంతృప్తి
మంచిర్యాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. సీసీఐ ద్వారా జిల్లాలో ఈ సీజన్‌లో మొత్తం 11 సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. తాండూరు మండలంలో నాలుగు, చెన్నూరులో ఆరు, లక్షెట్టిపేటలో ఒక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. నవంబరులో పత్తి పంట ఏరే సమయం కావడంతో అదే నెల మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- వానాకాలం సాగు దిగుబడి అంచనా ఇలా...
జిల్లా వ్యాప్తంగా వానాకాలం పత్తి సీజన్‌కు సంబంధించి 1,61,193 ఎకరాల్లో రైతులు పత్తిపంట సాగు చేశారు. ఎకరాకు సగటున ఎనిమిది క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అంచనా వేస్తుండగా, మొత్తంగా 13,33,811.2 క్వింటాళ్ల పత్తి రైతుల చేతికి వస్తుందని భావిస్తున్నారు.
- పెరిగిన సాగు ఖర్చులు...
వ్యవసాయ రంగంలో పంట సాగు విస్తీర్ణం కోసం రైతులు అధిక ఖర్చులు భరించాల్సి వస్తోంది. భూమి దున్నింది మొదలు పత్తి పంట చేతికి వచ్చే దాకా ఎకరాకు సగటున 40వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు కనీసం ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చినా అన్ని ఖర్చులు పోను 20వేల రూపాయల చొప్పున మిగిలుతుందని చెబుతున్నారు. అయితే ఈయేడు అతివృష్టితోపాటు యూరియా సకాలంలో అందక దిగుబడిపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరపిలేకుండా భారీవర్షాలు కురి యడంతో మొలక దశలోనే పత్తి పంటకు తీరని నష్టం వాటిల్లినట్లు చెబు తున్నారు. పంటకు సకాలంలో యూరియా సకాలంలో చల్లకపోవడం తో చెట్టు పెరుగుదలపై ప్రభావం చూపిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఎకరాకు గరిష్టంగా నాలుగు క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితిలేదని, సాగు ఖర్చులుకూడా గిట్టుబాటు కావని చెబుతున్నారు.
- మద్దతు ధరపై అసంతృప్తి...
ఆరుగాలం కాయ కష్టం చేసి, పండించిన పంటలకు కనీస మద్దతు ధర రావడం లేదని కొంతకాలంగా రైతులు వాపోతున్నారు. ఈ సంవత్స రం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పత్తిపంట మద్దతు ధర లు కూడా కంటి తుడుపు చర్యగానే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఈయేడు పత్తికి క్వింటాలుకు 8,110 రూపాయల మద్దతు ధర ప్రకటించారు. గత ఏడాది క్వింటాలు పత్తి మద్దతు ధర 7,521 రూపాయలు ఉండగా, ఈ సంవత్సరం అంతకంటే 589 రూపాయలు ఎక్కువగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు సీసీఐలో విక్రయాలు జరిపితే కష్టమే మిగులుతుందని, ప్రైవేటు ఆశ్రయించడమే మేలన్న ఆలోచనలో రైతులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు మార్కెట్లో ధర ఎక్కువ లభించే అవకాశాలు ఉండటంతో అటువైపే రైతులు మొగ్గు చూపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సాగు ఖర్చులు పెరగడం, దిగుబడి తగ్గే అవకాశాలు ఉండటంతో గిట్టుబాటు ధర కోసం రైతులు వేచి ఉండే అవకాశాలు ఉన్నాయి.