రేషన్ కార్డుల పంపిణీకి కసరత్తు
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:48 PM
జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు మంజూరైన లబ్ధిదారుల కార్డులు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి చేరుకున్నాయి. వాటిని అధికారులు మండలాల వారీగా వేరు చేస్తున్నారు.
- ఈనెల 25 నుంచి షురూ
- జిల్లాలో 7,443 మంది అర్హులు
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు మంజూరైన లబ్ధిదారుల కార్డులు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి చేరుకున్నాయి. వాటిని అధికారులు మండలాల వారీగా వేరు చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పంపిణీ చేయాలని సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2019, 2021లలో కొత్తగా ఆహర భద్రత కార్డులు జారీ చేశారు. ఆ తరువాత కొత్త కార్డుల జాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలన, మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. రెవెన్యూ అధికా రులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించారు.
- జిల్లాలో 1,41,904 కార్డులు..
రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల ద్వారా 10,410 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో 7,443 మంది అర్హులుగా గుర్తించింది. 134 దరఖాస్తులను తిరస్కరించింది. మిగతావి డీఎస్‌వో, తహసీల్దార్, ఆర్‌ఐల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే వివాహమై పిల్లలు కలిగిన వారు కొత్తగా వారి పేర్లను చేర్చడం కోసం దరఖాస్తులు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,41,904 కార్డులు ఉండగా ఇందులో 4.48 లక్షల మంది సభ్యులున్నారు.
- కొత్త సభ్యుల చేర్పుల కోసం...
వివాహమై పిల్లలు కలిగిన వారు కొత్తగా వారి పేర్లను చేర్పించడం కోసం దరఖాస్తులు చేస్తున్నారు. మీసేవా కేంద్రాల ఏప్రిల్ నుంచి జూలై 15 వరకు 24,637 కార్డుదారులు కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో 21,613 మంది కార్డులో సభ్యులను జోడించి మంజూరు చేశారు. మిగతా కార్డులకు సంబంధించి అధికారుల పరిశీలన కొనసాగుతోంది.
అర్హులందరికీ ఇస్తాం..
డేవిడ్, డీఎస్‌వో, ఆసిఫాబాద్
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. మీసేవా, ప్రజాపాలన సభల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసి అర్హులైన వారందరికి కార్డులిస్తాం. జిల్లాలో 7,443 కార్డలు లబ్ధిదారులకు మంజూరయ్యాయి. వాటిని ఈనెల 25వ తేదీ నుంచి అందజేస్తాం.