బడులకు రేటింగ్స్
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:46 PM
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్య, మౌలిక వసతులు కల్పనతో పాటు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు కలిగిన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది.
- స్వచ్ఛ ఏవమ్ హరిత్ కింద పాఠశాలల ఎంపిక
- ఈ నెల 30వరకు దరఖాస్తుల స్వీకరణ
- జాతీయ స్థాయిలో ఎంపికైతే రూ. లక్ష ప్రోత్సాహం
వాంకిడి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్య, మౌలిక వసతులు కల్పనతో పాటు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు కలిగిన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది. ప్రతీ ఏడాది స్వచ్ఛ పాఠశాలలకు నగదు పురస్కారాలను అందిస్తుండగా ఎస్‌హెచ్‌వీఆర్ (స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్) పేరుతో జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలో ఎంపికైన పాఠశాలలకు రూ. లక్ష చొప్పున నగదు పురస్కారాలు ప్రభుత్వం అందిస్తుంది. ఇందులో భాగంగానే 2025- 26 ఏడాదికిగాను పురస్కారాల ఎంపిక కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్‌హెచ్‌వీఆర్ యాప్ ద్వారా ఆయా పాఠశాలల ప్రధానోపాద్యాయులు ఈ నెల 30 లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకునే అంశాలపై ఎంఈవోలు, ఆర్‌పీలు సమావేశాలు నిర్వహించి ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఆరు అంశాలు.. 125 పాయింట్లు
యాప్‌లో పాఠశాలకు సంబందించిన నీటివసతి, మరుగుదొడ్లు, చేతుల శుభ్రత, విద్యార్థుల నడవడిక, కార్యకలాపాలు, నిర్వహణ, ప్రకృతి పర్యావరణం వంటి ఆరు అంశాలకు సంబంధించి అరవై ప్రశ్నలు ఉంటాయి.
- నీటి వసతికి 22 పాయింట్లు (1 నుంచి 9 ప్రశ్నలు)
- వినియోగం 27 పాయింట్లు (10 నుంచి 21 ప్రశ్నలు)
- చేతులు కడుక్కోవడం 14 పాయింట్లు (22 నుంచి 27 ప్రశ్నలు)
- కార్యకలాపాల నిర్వహణ 21 పాయింట్లు (28 నుంచి 40 ప్రశ్నలు)
- ప్రవర్తన సామర్థ్య నిర్మాణం 20 పాయింట్లు (41 నుంచి 49 ప్రశ్నలు)
- ప్రకృతి పర్యావరణానికి సంబంధించి 21 పాయింట్లు (50 నుంచి 60 ప్రశ్నలు)కు ఆన్‌లైన్‌లో సమాధానాలు ఇవ్వాలి. మొత్తం 125 పాయింట్లు కేటాయింపు ఉంటుంది. పూర్తి సమాచారాన్ని నమోదు చేసి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
- జిల్లా నుంచి ఎనిమిది పాఠశాలలు..
పాఠశాలల ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరాల ప్రకారం పాయింట్లు కేటాయింపు ఉంటుంది. అందులో అఽధిక స్టార్స్ వచ్చిన పాఠశాలలను జిల్లా తనిఖీ బృందం సందర్శిస్తుంది. ఇందులో ఎనిమిది పాఠశాలలను తనిఖీ చేసి రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తుంది. అనంతరం రాష్ట్రస్థాయిలో పరిశీలన బృందం పరిశీలించి తుది జాబితాను జాతీయ స్థాయికి పంపిస్తుంది. చివరగా ఎంపికైన పాఠశాలకు లక్ష రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని ప్రభుత్వం అందజేస్తుంది.
- యాప్‌లో రిజిస్ట్రేషన్ ఇలా...
ఎస్‌హెచ్‌వీఆర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పాఠశాలలను ఎంచుకున్న తర్వాత సైన్ ఆప్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాఠశాల యూడైస్ కోడ్‌ను నమోదు చేసి క్యాప్‌చర్‌ను ఎంటర్ చేసి కంటీన్యూను క్లిక్ చేయాలి. దీంతో యూడైస్‌లో యూజర్ ఐడీ( స్యూల్) నమోదు చేసిన మొబైల్ నంబరును ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. అనంతరం ఓటీపీ సబ్మిట్ చేసిన వెంటనే పాఠశాలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. చివరగా అన్ని వివరాలు చెక్ చేసుకొని పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి.
- 30 లోగా దరఖాస్తు చేయాలి
శివచరణ్‌కుమార్, మండల విద్యాధికారి
ఎస్‌హెచ్‌వీఆర్ మొబైల్ యాప్‌పై ఇప్పటికే ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాము. మొబైల్ యాప్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో వాస్తవ పరిస్థితులను మాత్రమే నమోదు చేయాలి. ఎస్‌హెచ్‌వీఆర్ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ నెల 30 లోగా తప్పనిసరిగా దర ఖాస్తు చేసుకోవాలి. జాతీయ స్థాయిలో ఎంపికైన పాఠశాలలకు రూ. లక్ష ప్రోత్సాహం అందజేస్తారు.
- జిల్లాలోని పాఠశాలల వివరాలు
మొత్తం పాఠశాలలు 1,275
ప్రాథమిక పాఠశాలలు 908
ప్రాథమికొన్నత పాఠశాలలు 180
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 170
కేజీబీవీ పాఠశాలలు 15
మోడల్ స్కూల్క్ 02