Share News

విచ్చలవిడిగా మొరం తవ్వకాలు

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:04 PM

ఎలాంటి అనుమతులు లేకున్నా...అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతూ లక్షలు కొల్లగొడుతున్న వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది.

విచ్చలవిడిగా మొరం తవ్వకాలు

- దండేపల్లి మండలంలో రెచ్చిపోతున్న అక్రమార్కు లు

- గూడెం గుట్టలో అక్రమ తవ్వకాలు

- 50 లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలింపు

మంచిర్యాల, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి అనుమతులు లేకున్నా...అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతూ లక్షలు కొల్లగొడుతున్న వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. అక్రమార్కులు అర్ధరాత్రి సమయంలో మొరం తవ్వకాలు జరుపుతూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. అక్రమార్కుల ధన దాహానికి కొండలు, గుట్టలు కరిగిపోతుండగా, నిత్యం లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. దండేపల్లి మండలంలో ఈ అక్రమ బాగోతం కొద్ది నెలలుగా యథేచ్ఛగా జరుగుతోంది.

దండేపల్లి మండలం గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రంగంపల్లె శివారు సర్వే నంబరు 444లోని ప్రభుత్వ స్థలంలో కొద్ది రోజులుగా కొందరు వ్యాపారులు అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో మొరం తవ్వకాలు జరుపుతూ టిప్పర్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం సగటున 50 లారీల ద్వారా మొరాన్ని తరలిస్తూ ఒక్కో ట్రిప్పును 5,000 రూపాయల వరకు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ నిర్వహిస్తున్న అక్రమ దందా కారణంగా కనీసం రెండు లక్షల రూపాయల మేర చేతులు మారుతున్నట్టు సమాచారం. వ్యాపారుల ధన దాహం కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుండగా, అక్రమార్కుల జేబులు నిండుతున్నాయి. ఈ అక్రమ దందా వెనుకాల కొందరు రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నాయకుల ప్రమేయం ఉన్న కారణంగానే సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

నాణ్యమైన మొరం కావడంతో....

దండేపల్లి రంగంపల్లెలో లభ్యమవుతున్న మొరం నాణ్యతతో కూడుకున్నది కావడంతో పెద్దఎత్తున డిమాండ్‌ ఉంది. ఆ మొరాన్ని రోడ్లకు ఉపయోగిస్తే వర్షాకాలంలో బురదమయం కాకుండా ఉండటంతో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల నిర్వాహకులు దానిపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. రెండునెలల క్రితం కూడా దండేపల్లి మండలంలోని అందుగులపేట గ్రామ శివారులో సర్వే నంబర్‌ 9లో విస్తరించి ఉన్న గుట్టలోనూ పెద్ద మొత్తంలో మొరం, మట్టి తవ్వకాలు జరిపారు. అలాగే మండలంలోని వందురుగూడ సమీపంలోనూ పెద్ద మొత్తంలో గుట్టలో మొరం, మట్టి తవ్వకాలు జరుపుతూ ఇతర ప్రాంతాలకు తరలించారు. మొరాన్ని తరలించేందుకు వ్యాపారులు భారీ వాహనాలు ఉపయోగిచడంతో రోడ్డు గుంతలమయంగా మారడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో మొరం తవ్వకాలు నిలిచిపోయినప్పటికీ తాజాగా రంగంపల్లెపై అక్రమార్కుల దృష్టి పడింది. దండేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గూడెం సత్యనారాయణస్వామి ఆలయం విస్తరించి ఉన్న సర్వే నంబరు 226లోని గుట్టలోనూ గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం. మండలంలోని వివిధ ప్రాంతాల్లో మొరం, మట్టి తవ్వకాలు జరుపుతున్న వ్యాపారులు వాటిని ప్రభుత్వ పథకమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తరలించేందుకు తమకు అనుమతులు ఉన్నాయని ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. ఒకవేళ సంబంధిత అధికారుల నుంచి అనుమతులు ఉన్నా... నిబంధనల మేరకు తవ్విన మొరం, మట్టిని కేవలం ఇందిరమ్మ ఇళ్ల అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. అదికూడా దండేపల్లి మండల పరిధిలో మాత్రమే లబ్ధిదారులకు అందజేయాలి. ఈ విషయం మైనింగ్‌ శాఖ జారీ చేసిన ప్రొసీడింగులోనూ పేర్కొనడం గమనార్హం. అలా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు వివిధ ప్రాంతాల్లో తవ్విన మొరం, మట్టిని మండల పరిధులు దాటి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ పెద్దమొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆండాళమ్మ కాలనీలో ట్రాక్టర్‌ సీజ్‌....

ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని అండాళమ్మ కాలనీ సమీపంలోగల జాలా గుట్టలో అక్రమంగా మొరం, బండరాళ్లను తరలిస్తున్న ట్రాక్టర్‌ను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. ’కరిగిపోతున్న జాలా గుట్ట’ శీర్షికన ఈ నెల 8న ’ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. కథనంపై స్పందించిన తహసీల్దార్‌ రఫతుల్లాఖాన్‌ ఆదేశాల మేరకు మరునాడు రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలం వద్ద మాటు వేశారు. గుట్టలో అక్రమంగా తవ్విన బండరాళ్లను తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ తారసపడటంతో సిబ్బంది దాన్ని సీజ్‌ చేసి, స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్‌ యజమానికి రూ 5000 జరిమానా విధించి వదిలిపెట్టారు. ఈ విషయమై పోలీసులు, రెవెన్యూ అధికారులపై కొందరు నాయకులు ఒత్తిడి తేవడంతోనే సీజ్‌ చేసిన వాహనాన్ని వదిలిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే జాలా గుట్టలో తవ్విన మొరాన్ని స్థానికంగా మసీదు పక్కన నిలువ చేయగా, సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది దాన్ని సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన మొరాన్ని గుట్టు చప్పుడు కాకుండా రాత్రికిరాత్రే అక్కడి నుంచి తరలించి విక్రయించడం కొసమెరుపు.

Updated Date - Nov 11 , 2025 | 11:04 PM