రైతుల సంక్షేమం కోసమే కొనుగోలు కేంద్రాలు
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:01 PM
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
లక్షెట్టిపేట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని మోదెల, ఇటిక్యాల, గంపలపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సంభందిత అధికారులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రం నిర్వహకులు ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. కేంద్రాల్లో రైతులకు సరిపడా గన్ని సంచులతో పాటు టార్పాలిన్ కవర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని, కేంద్రాల్లో దొడ్డురకం, సన్నరకం ధాన్యం రెండు కొనుగోలు చేస్తామన్నారు. సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, తహసీల్దార్ దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్‌చంద్, వైస్‌చైర్మన్ ఆరీఫ్ పాల్గొన్నారు.
వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
మంచిర్యాల కలెక్టరేట్: వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం 2025 పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఈ నెల 12న వారోత్సవాల ప్రారంభం, 13న ఆటపాటలు, వినోద కార్యక్రమాలు, 14న ఉచిత ఆరోగ్య శిబిరాలు, 15న వయోవృద్ధుల హక్కులపై అవగాహన ర్యాలీ, 17న జిల్లా స్థాయిలో వృద్ధుల చట్టాలు, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం, 18న గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు, 19న రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వృద్ధులు తమ పోషణ, ఇతర ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ 14567లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.