ప్రజా సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:18 PM
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రపంచ దేశాలకు తెలంగాణ కీర్తికిరీటమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు.
మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు
- సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వ పాలన
- నాటి పోరాట యోధులను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలి
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌రావు
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజాసంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రపంచ దేశాలకు తెలంగాణ కీర్తికిరీటమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ప్రజాపాలన దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. బెల్లంపల్లి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సంపత్‌కుమార్, కమాండర్ వెంకటేష్ నేతృత్వంలో గౌరవ వందనం సమర్పించారు. కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు 26,510 నూతన రేషన్ కార్డులు అందించడంతో పాటు రేషన్ కార్డుల్లో 60,790 మందిని చేర్చి లబ్ధి చేకూర్చామన్నారు. జిల్లాలో 2,47,923 మంది కార్డులదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో రైతు బీమా పథకం 83,114 మంది రైతులను చేర్చి ఇప్పటి వరకు 347 మంది రైతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున 17కోట్ల35 లక్షలు చెల్లించామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసి శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10,503 ఇళ్లు మంజూరు కాగా, 6,682 ఇళ్లు గ్రౌండింగ్ చేయబడి, 107 ఇళ్లు స్లాబ్ నిర్మాణంలో ఉన్నాయన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతీ ఆడబిడ్డకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని తుెలిపారు.
- మహిళలకు చేయూత..
ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా క్యాంటీన్‌లు, మీసేవ కేంద్రాలు, చిన్న పరిశ్రమలు, ఇతర వ్యాపారాల ఏర్పాటుకు బ్యాంకు లింకేజీ ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూతను ప్రభుత్వం అందిస్తోందన్నారు. విద్యారంగ బలోపేతం కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 40 శాతం డైట్, 200 శాతం కాస్మోటిక్ చార్జీలను పెంచామన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను మంజూరు చేస్తుందన్నారు. అంతర్గత రోడ్లు వీధిదీపాలు, సెంట్రల్ లైటింగ్‌లను మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేశామ న్నారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమం దిశగా ముందుకు సాగుతుం దని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, డీఎఫ్‌వో శివ్‌ఆశిష్‌సింగ్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాసరావు, డీఆర్‌డీవో కిషన్, ఏవో పిన్న రాజేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, వెంకటేశ్వర్లు, అనిత, డీఈవో యాదయ్య, రవికృష్ణ, డీపీఆర్‌వో కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
- ఆకట్టుకున్న పోలీసు కవాతు
కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో రిజర్వ్ ఇన్‌స్పె క్టర్ సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు కవాతు ఆకట్టు కుంది. మొట్టమొదటిసారిగా మహిళ పోలీసు కానిస్టేబుళ్లతో కవాతు నిర్విహించారు. కళాకారుల ఆటాపాట వీక్షకులను అలరించింది. వ్యాఖ్యత జనార్దన్ తన వ్యాఖ్యానంతో ఉత్సాహపరిచారు. కళాకారులు జయ జయ తెలంగాణ తెలంగాణ గీతాలకు నృత్యాలు చేసి అలరించారు. సంస్కృతిక కళాకారులు సురేందర్,రవీందర్, పోచం, కృష్ణమురళీ, నిరోషా తదితరు లు ఆట పాటలతో అలరించారు.