ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:25 PM
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు.
- అదనపు కలెక్టర్ డేవిడ్
ఆసిఫాబాద్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
మూడు నెలలుగా తాగునీరు రావడం లేదని నీటి సరఫరా పునరుద్ధరించాలని సిర్పూర్(టి) మండల కేంద్రానికి చెందిన కాలనీవాసులు దరఖాస్తు అందజేశారు. కౌటల మండలం తుమ్మగూడ గ్రామానికి చెందిన చౌహాన్ ఆశ్విని తన భర్త మరణించినందున తనకు ఉపాధి కల్పించాలని, తిర్యాణి మండలం సుంగాపూర్‌కు చెందిన శంకర్ తాను సాగుచేస్తున్న భూమికి పట్టా ఇప్పించాలని అర్జీ సమర్పించారు. వాంకిడి మండల కేంద్రానికి చెందిన శ్యాంరావు మండలంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం గోలేటికి చెందిన రేణుక తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని, రెబ్బెన మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన అమృతబాయి తనకు వ్యవసాయ రుణం పునరుద్ధరించలని అర్జీ సమర్పించారు. కాగజ్‌నగర్ మండలం గన్నారంనకు చెందిన పోవం తాను సాగు చేస్తున్న భూమికి పట్టా ఇప్పించాలని కోరారు.
ప్రధాన మంత్రి జన్‌మన్ పథకం కింద జిల్లాలోని పీవీఈజీలకు ఇళ్లు మజూరు చేయాలని జిల్లా పీవీటీజీ సంఘం ప్రతినిధులు అర్జీ సమర్పించారు. వాంకిడి మండలం పిప్పర్‌గొంది గ్రామానికి చెందిన గులాబ్ తాను మాజీ నక్సలైట్ అని లొంగిపోయానని తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.