Share News

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

ABN , Publish Date - Jul 03 , 2025 | 11:28 PM

ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
బాబాపూర్‌లోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఆహారాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచించారు. గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్‌ మండలం బాబాపూర్‌ గ్రామంలోని తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి నదీం అహ్మద్‌తో కలిసి వంటశాల, నిత్యావసర సరుకుల నాణ్యత, బియ్యం నిల్వలు, వండిన ఆహారాన్ని, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, వంట సరుకులను క్రమపద్ధతిలో అమర్చుకొని వంటలు వినియోగించాలని తెలిపారు. ప్రతిరోజు మెనూ ప్రకారం విద్యార్థినులకు పోషకాహారం అందించాలని, విద్యార్థినులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. గురుకుల పాఠశాల భవనం, ఆవరణ పరిశుభ్రంగా ఉండే విధంగా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని సూచించారు. తరగతిలో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. అనంతరం ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులతో కలిసి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణలోని ఖాళీస్థలాల్లో పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటి సంరక్షించాలని, బెండకాయ, వంకాయ, బీరకాయ, టమాట ఇతర మొక్కలు నాటాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 11:28 PM