Share News

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:12 PM

ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు అందించే దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచించారు.

ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు అందించే దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని జన్కాపూర్‌ వార్డుకు చెందిన సమీనబేగం తన ఇల్లు ఇటీవల వర్షాలకు కూలిపోయిందని నష్టపరిహారం ఇప్పించాలని దరఖాస్తు సమర్పించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరికాలనీకి చెందిన తార తాను రెబ్బెన మండలం గంగాపూర్‌ శివారులో కొనుగోలు చేసిన భూమికి పట్టా జారీ చేయాలని అర్జీ సమర్పించారు. కాగజ్‌నగర్‌ మండలం నజ్రుల్‌నగర్‌కు చెందిన సమిత్‌దాస్‌ తన కూతురుకు ఆసిఫాబాద్‌ మండలం బాబాపూర్‌ మైనార్టీ గురుకుంలో సీటు ఇప్పించాలని కోరారు. కాగజ్‌నగర్‌ మండలం నజ్రుల్‌నగర్‌, దుర్గానర్‌కు చెందిన సుమతి మండల్‌ ఇటీవల కురిసిన బారీ వర్షాలకు తన చేనులో వరి, పత్తి పంటలు మునిగిపోయాయని సర్వే జరిపి నష్టపరిహారం ఇప్పించాలని అర్జీ సమర్పించారు. కాగజ్‌నగర్‌ మండలం నజ్రుల్‌కు చెందిన చంద్రకాంత్‌ మండల్‌ తనకు జారీ చేసిన పట్టాదాపు పాసు పుస్తకంలో పేరు తప్పుగా నమోదు అయినందున సవరించాలని కోరారు. ఆసిఫాబాద్‌ పట్టణానికి చెందిన అక్షర చిట్‌ఫండ్‌ బాధితులు తాము అక్షర చిట్‌ ఫండ్‌లో జమ చేసిన డిపాజిట్‌ డబ్బులను ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ఆసిఫాబాద్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో భూ భారతి దరఖాస్తుల పరిష్కారంపై సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌ రావు, జిల్లా సర్వే ల్యాండ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సోమేశ్వర్‌, తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 11:12 PM