ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:29 PM
ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం ఇజల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి ఆర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే దిశగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
రెబ్బెన మండలం గోలేటికి చెందిన తిరుపతి తన పేరిట గల పట్టా భూమిని సింగరేణి సంస్థ భూ సేకరణ చేసినందున ఇట్టి భూమిలో 324 నీలగిరి చెట్లకు సంబంధించిన నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ ఆర్జీ సమర్పించారు.
ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు..
- సిర్పూర్(టి) మండలం డోర్‌పల్లికి చెందిన రుషి తన పేరిట చింతలమానేపల్లి మండలం రన్‌వెల్లి గ్రామ శివారులో గల లావుని పట్టా భూమిని వేరొక వ్యక్తి అక్రమంగా పట్టా పొందాడని అట్టి పట్టా రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
- చింతలమానేపల్లి మండలం బూరెపల్లికి చెందిన సునీత తాను పదవ తరగతి చదివానని, తనకు బూరెపల్లి గ్రామ డీలర్‌గా నియమించాలని దరఖాస్తు అందజేశారు.
- దహెగాం మండలం కమ్మర్‌పల్లికి చెందిన షాజియాబేగం తన భర్త తాతల పేరిట గల భూమిని తనకు తెలియకుండా పట్టా మార్పిడికి ప్రయత్నిస్తున్నందున నిలుపుదల చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
- పెంచికలపేట మండలం ఎల్కపల్లికి చెందిన పెంటయ్య తాను సాగుచేస్తున్న ప్రభుత్వ భూమిని లావుని పట్టా చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
- సిర్పూర్(టి) మండలం డోర్‌పల్లికి చెందిన విఠల్ తన కుమారుడికి 9వ తరగతిలో ఏదైనా గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు.
- సిర్పూర్(టి) మండల కేంద్రానికి చెందిన బుజ్జి తాను సిర్పూర్(టి) శివారులో సాగు చేస్తున్న భూమికి పట్టా మజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు.
సౌర విద్యుత్ ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు మూడు రోజుల్లో నివేదికలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్దశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో అన్ని ప్రభ్వు కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, పోడు పట్టా భూములకు ఇందిరా పౌర గిరి జల వికాస పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతిగృహాలు అన్ని యజమాన్యాల గురుకులాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన వైశ్యాలం, నెలకు విద్యుత్ వినియోగం వంటి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయంలో ఖాళీ స్థలాల వివరాలు అందించాలని తెలిపారు. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం కింద సాగునీరు అందించేందుకు అర్హులైన వారి జాబితాను రూపొందించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని యజమాన్య పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీరు పొదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, జిల్లాకు ఆరు వేల ఇంకుడు గుంతల నిర్మాణాలు లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి
ఆసిఫాబాద్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజనంలో విద్యార్థులకు మోనూ ప్రకారం పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. సోమవారం ఆసిఫాబాద్ మండలం వట్టివాగు కాలనీలోని గిరిజన ప్రాథమిక పాఠశాల, దిశా ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యత, తరగతి గదులు, రిజిస్టర్‌లు, పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తరగతిలో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. నాలుగో తరగతి విద్యార్థులకు పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు సౌర కుటుంబం, గ్రహాల గురించి ఆంగ్లంలో వివరించ డంతో విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, ఏసీఎంవో ఉద్దవ్, ఎస్సీఆర్పీ రవీందర్, ప్రధానోపాధ్యాయుడు మాదవరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.