Share News

ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:39 PM

ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడిన ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలోని కర్ణమామిడిలో చోటు చేసుకుంది.

 ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి
మంచిర్యాల జిల్లా కర్ణమామిడిలో ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి

- ఇందిరమ్మ ఇల్లు మొదటి దఫా బిల్లు కోసం రూ. 30వేలు డిమాండ్‌

- రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

హాజీపూర్‌, సెప్టెంబరు 3 (ఆంఽధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడిన ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలోని కర్ణమామిడిలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణమామిడి పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మొదటి దఫా బిల్లు కోసం బేస్‌మెంట్‌ లేవల్‌ నిర్మాణం జరిగిన తరువాత ఫొటో కాప్చర్‌ తీసి ఉన్నతాధికారులకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే లబ్ధిదారులకు మొదటి దఫా బిల్లు మంజూరవుతుంది. పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి ఫొటో కాప్చర్‌ తీయడానికి గ్రామంలోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారైన డొల్క నాగమణికి 30వేల రూపాయలు డిమాండ్‌ చేశారు. బ్రతిమిలాడగా 20వేల రూపాయలకు ఒప్పుకున్నాడు. ఈ విషయమై లబ్ధిదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. బుధవారం లబ్ధిదారు నివాసానికి వచ్చిన పంచాయతీ కార్యదర్శి 20వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కరీంనగర్‌ ఏసీబీ కోర్టుకు తరలించినట్లు తెలిపారు.

- గ్రామస్థుల సంబరాలు..

పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి ఏసీబీ అధికారులకు పట్టుబడినట్టు గ్రామస్థులకు తెలియడంతో పంచాయతీ కార్యదర్శి ద్వారా ఇబ్బందులు పడిన 30 మంది బాధితులు డొల్క నాగమణి ఇంటికి చేరుకున్నారు. తాము కూడా లంచం ఇచ్చామంటూ న్యాయం చేయాలని నినాదాలు చేశారు.. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం, ఇంటి నిర్మాణానికి ఎన్‌వోసీల కోసం, ఇతరత్ర అవసరాల కోసం రూ. లక్షల్లో వసూలు చేశాడని ఏసీబీ అధికారుల ముందు వాపోయారు. లంచం ఇచ్చినట్టు ఆధారాలు ఉంటే తమకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా పంచాయతీకార్యదర్శి ఏసీబీకి పట్టుబడడంతో గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.

Updated Date - Sep 03 , 2025 | 11:39 PM