పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:22 PM
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు.
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. బుధవారం హైద్రాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాలు, జియో లొకేషన్ టీ పోల్ పోర్టల్‌లో నమోదు చేయాలని, పోర్టల్‌లో గ్రీవెన్స్ ఫ్లాట్‌ఫామ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దరఖాస్తులు, ఫిర్యాదుల పరిష్కారానికి నోడల్ అధికారిని నియమించి ఫిర్యాదులను మూడు రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు, తాగునీరు, విద్యుత్, ర్యాంపు, వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలను ఇతర సౌకర్యాలను కల్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ర్టాంగ్‌రూమ్‌లను కౌంటింగ్‌కు మూడు రోజుల ముందుగా సిద్ధం చేయాలని, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఆర్డీవో శ్రీనివాసరావు, నోడల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలెక్టరేట్ సమీకృత భవన సమావేశంలో మందిరంలో నిర్వహించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ల ప్రక్రియపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులకు అవసరమైన శిక్షణ అందిస్తామన్నారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్ధుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఫలితాలు వంటి ప్రతీ అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి అభ్యర్ధి తప్పనిసరిగా బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలన్నారు. నామినేషన్‌ల పరిశీలన, ఓట్ల లెక్కింపు అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఎన్నికల గుర్తుల కేటాయింపులో జాగ్రత్తలు వహించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉన్నా శిక్షణ సమయంలో నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, నోడల్ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.