Share News

‘ఓరియంట్‌’ ఎన్నికల్లో హోరాహోరీ

ABN , Publish Date - Aug 29 , 2025 | 01:13 AM

కాసిపేట మండలం దేవాపూర్‌లోని ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీలో యూనియన్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఎన్నికలు నిర్వహిస్తుండగా, చివరి రెండురోజులు ధన ప్రవాహం జోరుగా కొనసాగింది.

‘ఓరియంట్‌’  ఎన్నికల్లో హోరాహోరీ
ఓరియంట్‌ కంపెనీ

- భారీగా ధన ప్రవాహం

- ఒక్కో ఓటుకు రూ. 70వేల వరకు పంపిణీ

- కార్మికుల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థుల యత్నం

మంచిర్యాల, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): కాసిపేట మండలం దేవాపూర్‌లోని ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీలో యూనియన్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఎన్నికలు నిర్వహిస్తుండగా, చివరి రెండురోజులు ధన ప్రవాహం జోరుగా కొనసాగింది. ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో అభ్యర్థులు భారీ మొత్తంలో ఖర్చు చేయడానికైనా వెనకాడటం లేదని తెలుస్తోంది. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు పెద్దమొత్తంలో నగదు ముట్టజెప్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా ఇప్పటికే పలువురు ఓటర్లు, యూనియన్‌ లీడర్లను గోవా, హైదరాబాద్‌ లాంటి నగరాలకు క్యాంపులకు తరలించినట్లు సమాచారం. క్యాంపుల్లో నాయకులకు సకల సౌకర్యాలు కల్పించినట్లు తెలుస్తోంది.

ఫ రంగంలోకి మంత్రి, ఎమ్మెల్యేలు....

ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ ఎన్నికల్లో పోటీ పడుతున్న కొక్కిరాల సత్యపాల్‌రావు, పుస్కూరి విక్రం రావులకు మద్దతుగా చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేకానంద (రాష్ట్ర కార్మికశాఖ మంత్రి), కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వినోద్‌ రంగంలోకి దిగారు. బరిలో నిలిచిన కొక్కిరాల సత్యపాల్‌రావు స్వయానా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సోదరుడు కాగా, మరో అభ్యర్థి విక్రం రావుకు మద్దతుగా గడ్డం సోదరులు రంగంలోకి దిగారు. దీంతో అభ్యర్థులకంటే ఎమ్మెల్యేల బలాబలాలపైనే ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పైముగ్గురు ఎమ్మెల్యేలు ఇంత కష్టపడలేదని ప్రచారం జరుగుతోంది. ప్రేంసాగర్‌రావుకు కాసిపేట సొంత మండలం కావడంతో ఆయన తన సోదరుడి గెలుపే లక్ష్యంగా పట్టుదలతో ఉన్నారు. కొంతకాలంగా గడ్డం సోదరులకు, ప్రేం సాగర్‌రావు మధ్య దూరం పెరిగింది. తనను కాదని వివేకానందకు మంత్రి పదవి దక్కడంతో ప్రేంసాగర్‌రావు ఒకింత గుర్రుగా ఉన్నారు. దీంతో ఓరియంట్‌ సిమెంట్‌ ఎన్నికల్లో ఆదిపత్యం కొనసాగించాలనే పట్టుదలతో ప్రేంసాగర్‌రావు ఉన్నారు. తమ అభ్యర్థిని విజయం వరించేలా మంత్రితోపాటు ఎమ్మెల్యేలంతా ఎవరికి వారే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గుర్తింపు సంఘం ఎన్నికలను ఎమ్మెల్యేలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కొద్ది రోజులుగా జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ సాగుతోంది. తామే స్వయంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు భావిస్తున్న ప్రజాప్రతినిధులు తమ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. విక్రంరావుకు మంత్రి వివేక్‌, బెల్లంపల్లి, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్‌, వెడ్మ బొజ్జు మద్దతునిస్తుండగా, సత్యపాల్‌రావు తరుపున మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఒంటరి పోరాటం చేస్తున్నారు. అభ్యర్థులు ఇరువురికి మద్దతుగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అనుచరులు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా స్వయంగా రంగంలోకి దిగడంతో ఓరియంట్‌ ఎన్నికల్లో చివరికి గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ కార్మికులతోపాటు అక్కడి ప్రజల్లోనూ నెలకొంది.

భారీగా ధన ప్రవాహం...

ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో భారీగా దన ప్రవాహం కొనసాగినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కంపెనీలో 266 మంది కార్మికులు పనిచేస్తుండగా, వారంతా ఈ నెల 29న జరుగనున్న ఎన్నికల్లో తమఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లును తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ఇరువురి తరుపున పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఓటర్ల స్థాయిని బట్టి ఒక్కొక్కరికి రూ. 30 వేలు మొదలుకొని రూ. 80వేల వరకు ముట్టజెప్పినట్లు సమాచారం. నగదు చెల్లింపులతోపాటు టూర్లు, విందుల పేరుతోనూ భారీగా ఖర్చు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

నేడే దేవాపూర్‌ సిమెంట్‌ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు

కాసిపేట: దేవాపూర్‌ సిమెంట్‌ కంపెనీలో శుక్రవారం జరుగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. బుధవారంతో కార్మిక సంఘాల గేటు మీటింగ్‌ ముగియడంతో గురువారం నుంచి బహిరంగ ప్రచారానికి తెరపడింది. దీంతో ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోటాపోటిగా జరిగిన ఎన్నికల ప్రచారంతో గెలుపుపై ఎవరిదీమా వారే లెక్కలేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం మూడు గంటల వరకు ముగుస్తుంది. అదే రోజు సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి.

- డీసీఎల్‌ అధికారులు ఓరియంట్‌ ఎన్నికల్లో ఐదు యూనియన్లకు పోటీ చేసే అవకాశాలు కల్పించారు. కానీ ఓరియంట్‌ సిమెంట్‌ కార్మిక సంఘం, లోకల్‌ ఓరియంట్‌ సిమెంట్‌ ఎంప్లాయిమెంట్‌ వర్కర్స్‌ యూనియన్‌ విక్రమ్‌రావుకు మద్దతు తెలుపుతోంది. తెలంగాణ ఓరియంట్‌ సిమెంట్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఓరియంట్‌ సిమెంట్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ సత్యపాల్‌రావుకు మద్దతు తెలుపుతోంది. ఓరియంట్‌ సిమెంట్‌ పర్మినెంట్‌ వర్కర్స్‌ లోకల్‌ యూనియన్‌ తటస్థంగా ఉండిపోయింది. ఇరువర్గాల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.

Updated Date - Aug 29 , 2025 | 01:13 AM