పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు పరాభవమే
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:52 PM
రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 95 శాతం స్థానాల్లో విజయం సాధిస్తారని, ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి పరాభవం తప్పదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు.
- మంత్రి వివేక్‌వెంకటస్వామి
మందమర్రిటౌన్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 95 శాతం స్థానాల్లో విజయం సాధిస్తారని, ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి పరాభవం తప్పదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. గ్రామాల అభివృద్థికి పెద్దపీట వేయడంతో పాటు వాటిని పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందన్నారు. బుధవారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమక్రమంగా అమలు చేస్తున్నామన్నారు. సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, నూతన రేషన్ కార్డులు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ ఎన్నికల్లో వీటినే ప్రచారాస్ర్తాలుగా నాయకులు ఉపయోగించాలని సూచించారు. అనంతరం పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్ధులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
- కొత్త ప్రాజెక్టులు రావాలి
సింగరేణిలో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని దీనికి సంబంధించి తమ ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. మందమర్రి ఏరియాలోని ఆర్‌కే ఓసీ విస్తరణతో ఏరియాకు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ఓసీ విస్తరించే ప్రాంతాల్లో ప్రజల డిమాండ్లను కూడా యాజమాన్యం పరిష్కరించాలన్నారు. త్వరలోనే జైపూర్ పవర్‌ప్లాంట్‌లో ప్లాంట్ విస్తరణ పనులు చేపడతామని తెలిపారు. సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులకు సంబంధించి ఒరిస్సా తరహాలోనే వేలం పాటంలో దక్కించుకోవాలని కోరుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి, స్థానిక నాయకులు ఉపేందర్‌గౌడ్, సొత్కు సుదర్శన్, గుడ్ల రమేష్, శ్రీనివాస్, నర్సింగ్, ఇసాక్, జావేద్, సంగి సంతోష్, ఆకారం రమేష్ తదితరులు పాల్గొన్నారు.