నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:58 PM
నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు.
కలెక్టర్ కుమార్‌దీపక్
బెల్లంపల్లి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. బుధవారం మండలంలోని బూదకుర్తి, చాకపల్లి గ్రామాల్లో రెండో విడత నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్, పోటిలో ఉండే అభ్యర్థుల తుదిజాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఇతర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారు లకు సూచించారు. నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి జాబితా పూర్తి వివరాలతో రూపొందించాలన్నారు. అనంతరం మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేందర్, పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన
వేమనపల్లి: వేమనపల్లి మండలంలోని వేమనపల్లిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను బుధవారం బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. బుధవారం నామినేషన్ల పరిశీలనలో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఎంపీడీవో కుమారస్వామి తెలిపారు. నాగారం గ్రామ పంచాయతీకి సర్పంచ్ స్థానానికి వేసిన ఒక నామినేషన్, కల్లెంపల్లిలో వార్డుమెంబర్ స్థానానికి వేసిన ఒక నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు తెలిపారు.