Share News

కొత్త ఆలోచనలకు పదునుపెట్టాలి

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:19 PM

రోజురోజుకు సాంకేతికపరంగా అనేక మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని విద్యార్థులకు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు.

కొత్త ఆలోచనలకు పదునుపెట్టాలి
విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్‌ను పరిశీలించి వారితో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- ప్రారంభమైన వైజ్ఞానిక ప్రదర్శన

నస్పూర్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : రోజురోజుకు సాంకేతికపరంగా అనేక మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని విద్యార్థులకు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. నస్పూర్‌ పట్టణం సీసీసీలో 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్‌ అవార్డ్‌ మనక్‌ జిల్లా స్థాయి ప్రదర్శన-ప్రాజెక్ట్‌ కాంపిటీషన్‌ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా సైన్స్‌ అధికారి రాజాగోపాల్‌లతో కలిసి కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ జ్యోతి ప్రజ్వలనచేసి ప్రదర్శనలను ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్‌ను పరిశీలించి వాటికి సంబంధించి ప్రశ్నలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచి కొత్త కొత్త ఆలోచనలపై దృష్టి సారించి సాంకేతిక రంగంలో ఎదగాలన్నారు. రోజురోజుకు సాంకేతిక పరంగా అనేక మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా కొత్త ఆలోచనలకు పదును పెట్టాలన్నారు. గతంలో ఆర్వో ప్లాంట్‌ పెట్టుకోవాలంటే ఖర్చుతో కూడుకుందని, కానీ ప్రస్తుతం ఆదే ఇంటింటికి చేరిందన్నారు. సమాజంలోని సమస్యల పరిష్కారానికి మార్గం సైన్స్‌ చూపిస్తుందని, అది సృజనాత్మక ఆలోచనలతోనే సాధ్యమవుతుందని కలెక్టర్‌ అన్నారు. సాంకేతిక రంగం అభివృద్ది చెందుతుందని, ఈ నేపఽథ్యంలో కొత్త ఆవిష్కరణల ద్వారా ప్రతీ రంగం అభివృద్ది అంచెలంచెలుగా జరుగుతుందన్నారు. ప్రపంచం ఆధునిక సాంకేతికత వైపు పరుగెడుతుందని, విద్యార్థులు సైన్స్‌లో ప్రతీ అంశాన్ని క్షుణంగా అధ్యయనం చేసి తెలుసుకోవాలని సూచించారు. అంతకు ముందు విద్యార్థులు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు నృత్యంతో స్వాగతం పలికారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సమావేశంలో నస్పూర్‌ మండల విద్యాధికారి పద్మజా, విద్యా శాఖ అధికారులు, ట్రస్మా నాయకులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 11:19 PM