చిరు వ్యాపారులకు అండగా ‘ముద్ర’
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:47 PM
చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక ప్రగతికి ఉపకరించే కేంద్రప్రభుత్వ పథకం ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ బ్యాంకర్ల సహాయ సహకారాలతో ప్రజల మన్ననలు పొందుతోంది.
- రుణాలు అందించడంలో బ్యాంకర్ల సేవలు భేష్
- జిల్లావ్యాప్తంగా రుణాల మంజూరులో టీజీబీ ముందంజ
- 32 శాతం రుణాలతో వ్యాపారుల పక్షపాతిగా పేరు
- ఆర్థిక స్వావలంబన దిశగా వ్యాపారులు
మంచిర్యాల, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):
చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక ప్రగతికి ఉపకరించే కేంద్రప్రభుత్వ పథకం ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ బ్యాంకర్ల సహాయ సహకారాలతో ప్రజల మన్ననలు పొందుతోంది. జిల్లాలోని అన్ని బ్యాంకులు ముందుకు వచ్చి సకాలంలో రుణాలు మంజూరు చేస్తే వ్యాపారుల ఆర్థిక ప్రగతికి మరింతగా తోడ్పాటు అందేది. కొన్ని బ్యాంకులు మొక్కుబడిగా రుణాలు మంజూరు చేస్తుండటంతో ప్రభుత్వ పథకం లక్ష్యం జిల్లాలో సంపూర్ణం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కుకొని బతుకులు బుగ్గిపాలు చేసుకుంటున్న చిరువ్యాపారులకు ఆర్థికంగా తోడ్పాడుటునందించే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ పథకాన్ని ప్రారంభించింది. సేవారంగం, ఉత్పత్తి రంగాలకు చెందిన వ్యాపారస్థులకు అవసరమైన రుణాలు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా చిరు వ్యాపారులు సమీపంలోని బ్యాంకుల్లోనే ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం పొందే వెసులుబాటు కల్పించింది. అయితే జిల్లాలో మాత్రం ఈ పథకం ఆశించిన స్థాయిలో లక్ష్యం చేరడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పలువురు బ్యాంకర్లు అర్హులైన వ్యాపారులకు రుణాలు పంపిణీ చేయడంలో అనవసరమైన మెలికలు పెడుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మూడు విభాగాల్లో రుణాలు మంజూరు..
ముద్ర యోజన కింద శిశు, కిషోర్, తరుణ్ విభాగాల్లో రైతులకు రుణాలు అందించాల్సి ఉంది. వీటిలో శిశు పథకం కింద 50వేల రూపాయలు, కిషోర్ పథకంలో ఐదు లక్షల రూపాయలు, తరుణ్‌లో భాగంగా పది లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఆయా విభాగాల్లో అర్హతగల వ్యాపారులు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొంది వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. అయితే కొన్నిచోట్ల బ్యాంకర్లు నిర్ణయించిన మేరకు పూర్తిస్థాయిలో రుణం మంజూరు చేయడం లేదని తెలుస్తోంది. శిశు పథకం కింద రూ. 50వేలు రుణం ఇవ్వాల్సి ఉండగా కొన్ని బ్యాంకులు మాత్రం రూ. 25వేల నుంచి 30వేల వరకే ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కిషోర్, తరుణ్ పథకాల్లోనూ అదే పద్ధతి అవలంభిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో అన్ని రకాల బ్యాంకుల శాఖలు 28 వరకు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం లో ఆయా బ్యాంకులు వ్యక్తిగతంగా గరిష్టంగా 12 శాతం మేర మాత్రమే రుణాలు మంజూరు చేశాయి. దీనికి ‘సిబిల్’ స్కోర్ ప్రధాన సమస్యగా మారినట్లు తెలుస్తోంది. గతంలో బ్యాంకుల్లో రుణాలు పొందిన వ్యాపా రులు సకాలంలో నెలవారీ వాయిదాలు సకాలంలో చెల్లించకపోవడంతో చాలామంది వ్యాపారుల సిబిల్ స్కోరు పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా వ్యాపారులకు తిరిగి రుణాలు మంజూరు చేసేందుకు కొన్ని బ్యాంకులు కొంతమేర వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
రుణాల మంజూరులో టీజీబీ ముందంజ...
ముద్ర యోజన పథకం కింద వివిధ రంగాలకు చెందిన వ్యాపారుల కు రుణాలు మంజూరు చేయడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) ముందంజలో ఉంది. రుణాల విషయంలో వ్యాపారులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న ఏకైక బ్యాంకుగా టీజీబీ పేరు ప్రఖ్యాతు లను సొంతం చేసుకుంది. టీజీబీ బ్యాంకుకు బ్రాంచి కార్యాలయాలు అధికంగా ఉండటంతో ఎక్కడికక్కడే వ్యాపారులకు సేవలు అందుబాట ులో ఉంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరం జిల్లాలోని అన్ని బ్యాంకుల శాఖలతో పోల్చితే టీజీబీ 32.67 శాతం రుణాల మంజూరు చేసింది. జిల్లావ్యాప్తంగా 5,122 మంది వ్యాపారులకు రూ. 88.25 కోట్ల రుణాలు మంజూరు చేసిన టీజీబీ అగ్రస్థానంలో నిలిచింది.
అవగాహనలేమి కూడా కారణం...
చిరు వ్యాపారులకు సకాలంలో సులువుగా రుణాలు అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ముద్ర యోజనపై సరైన అవగాహనలేక వ్యాపా రుల నుంచి ఆశించినమేర స్పందన రావడంలేదని తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకాలపై ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంలేదని తెలుస్తోం ది. చిరువ్యాపారులను ఆదుకొనే ముద్ర యోజనపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే మరింత ప్రయోజన కారిగా మారే అవకాశం ఉంది.
వ్యాపారులకు వివిధ బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు
బ్యాంకు వ్యాపారులు రుణం(కోట్లలో)
టీజీబీ 5,122 88.25
బంధన్ 11,667 67.09
ఎస్‌బీఐ 2170 33.04
యాక్సిస్ 3431 19.1
యూబీఐ 672 18.06
ఇండస్ ఇండ్ 949 13.84
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ 371 10.69
హెచ్‌డీఎఫ్‌సీ 131 8.11