పల్లెపోరులో కదలిక
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:42 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
- పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన
- గ్రామాల్లో వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం
- రిజర్వేషన్లపై ఆశావహుల చూపు
వాంకిడి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నెలాఖరులోపు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశానుసారం ప్రభుత్వ యంత్రాంగం మండల, జిల్లా పరిషత్‌లతో పాటు గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబందించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామాలు, వార్డులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసింది. పంచాయతీ ఎన్నికలకైతే బ్యాలెట్ పేపర్ల ముద్రణను సైతం పూర్తి చేశారు. సోమవారం నిర్వహించే మంత్రుల సమావేశంలో రిజర్వేషన్లు, తదితర విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్ది ఈ నెల ఆఖరు వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని ప్రకటించడంతో ఆశావహుల్లో కదలిక తీసుకువచ్చింది. దీంతో పోటీచేయడానికి అనుగుణంగా తమ మద్దతుదారులతో సమాలోచనలకు తెర తీయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
- కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలన
అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నూనత పంచాయతీరాజ్ చట్టం 2018 అమల్లోకి తీసుకువచ్చి 2019లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించింది. జనవరి 1న ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడింది. జనవరి 21, 25, 30 తేదీల్లో మూడు విడతల్లో పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 1న సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. 2024 ఫిబ్రవరి 1వ తేదీతో పదవీకాలం ముగియడంతో జిల్లాలోని 335 పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొసాగుతోంది. 2018 ఆగస్టులో రాష్ట్రంలో తొలిసారిగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది. 2019 జనవరి వరకు ఆరు నెలల పాటు కొసాగింది. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రత్యేక పాలన రావడం ఇది రెండోసారి.
- సందిగ్ధం వీడితేనే...
రాష్ట్రంలో సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఆసెంబ్లీలో పంచాయతీ చట్ట సవరణ బిల్లును ఆమోదించినప్పటికీ కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఇప్పటి వరకున్న రిజర్వేషన్లు రెండోసారి వర్తిస్తాయా..? లేదా అనే విషయమై స్పష్టత రాలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. ఈ నిబంధనలకు లోబడి 2019లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించారు. ఒకవేళ చట్టంలో మార్పులు చేస్తే జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ సామాజికవర్గాలకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశ ముంది. జిల్లాలో 15 జడ్పీటీసీలు, 15 ఎంపీపీలు, 123 ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. గత ఏడాది జులై 4న పదవీకాలం ముగిసింది. వీటికి కూడా సర్పంచ్‌లకు మాదిరిగానే రెండు పర్యాయాలు రిజర్వేషన్ అమల్లో ఉంది. ఈనేపథ్యంలో ఆశావహులు ఇప్పటినుంచే తమ ప్రయత్నాలు ప్రారంభించారు.
- మాస్టర్ ట్రైనీలకు శిక్షణ పూర్తి
స్థానిక సంస్థల పోరుకు ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా విజయవంతంగా నిర్వహిచేందకు జిల్లా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఓటరు జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు బ్యాలెట్ పేపర్లు, బాక్స్‌లను ఇప్పటికే సిద్ధం చేసింది. ఎన్నికల నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించే సిబ్బందికి తర్ఫీదు ఇచ్చే మాస్టర్ ట్రైనీలకు శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే సిబ్బందిని ఎంపిక చేయటం, వారికి శిక్షణ ఇవ్వటం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించనున్నారు.
- నాయకుల ప్రతిప్యూహాలు
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామనే మంత్రి ప్రకటనతో రాజకీయ నాయకులు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అయా రాజకీయ పార్టీల నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. కుమరంభీం జిల్లాలో అధికార పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడంతో స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి ఉండగా, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై సమాలోచనలో పడ్డారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా జూపల్లి కృష్ణరావుకు బాధ్యతలు అప్పగించారు. ఆయన త్వరలో ఉమ్మడి జిల్లా నే తలతో సమావేశం నిర్వహించి స్థానికసంస్థల ఎన్నికలు ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేయనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానికసంస్థల ఎన్నికల బాధ్యతలు పూర్తిగా ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జిలదే అని నిర్దేశించారు.