జిల్లాపై ‘మొంథా’ ఎఫెక్ట్
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:13 PM
మొంథా తుపాన్ కారణంగా మంచిర్యాల జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది.
- ఎడతెరిపిలేని వర్షం
- నేలవాలిన వరి పంట
- అన్నదాతల్లో ఆందోళన
మంచిర్యాల, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుపాన్ కారణంగా మంచిర్యాల జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలో 10.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గరిష్టంగా చెన్నూరు మండలంలో 31.2 మిల్లీమీటర్ల వర్షం పడగా, కోటపల్లిలో 22.4 మిల్లీమీటర్లు, వేమనపల్లి మండలంలో 21.8 మిల్లీమీటర్లు, భీమారం మండలంలో 12.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నస్పూర్: మొంథా తుపాన్ ప్రభావం కారణంగా నస్పూర్ పట్టణంలో బుధవారం వర్షం కురిసింది. వరి కోతలు, పత్తి ఏరే సమయం కావడం వీటిపై తుపాన్ ప్రభావం పడింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం వలన రోడ్లపై వర్షపు నీరు, అంతర్గత రహదారులు చిత్తడిగా మారాయి. వర్షంతో పాటు గాలి వీస్తున్నందున నస్పూర్, సీతారాంపల్లి గోదావరి నది తీరం, చెరువుల కింద సాగు చేసిన వరి పంట అక్కడక్కడ నేలవాలింది. చేతి కందే సమయంలో తుపాన్ నష్టం కలిగిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు సాగు చేపట్టిన నాటినుంచి ఏదో విధంగా పంటలకు నష్టం కలుగుతూనే ఉందన్నారు. ప్రస్తుతం మొంథా తుపాన్ వలన కోతకు వచ్చిన వరి పంట నేలవాలిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మందమర్రిటౌన్: మందమర్రి పట్టణంలో బుధవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నమే చీకటిలా మబ్బులు కమ్మేశాయి. ఈదురు గాలులతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షానికి రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. రామన్ కాలనీ నుంచి కేకే 5 బంగ్లాస్ వరకు రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేకే 5 ఫిల్టర్ బెడ్ ఏరియాలోని నివాసాల్లోకి, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. పట్టణం నుంచి శంకర్‌పల్లెకు వెళ్లే రోడ్డు కొట్టుకుపోయి కంకర తేలింది. భాగ్యనగర్ కాలనీ, కూరగాయల మార్కెట్‌లో నీరు చేరింది. కార్మెట్ హైస్కూల్ సమీపం నుంచి వచ్చే వరద నీరు పక్కనే ఉన్న క్వార్టర్లలోకి చేరుతుందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. పాలచెట్టు నుంచి దొరల బంగ్లా వరకు రోడ్డు కనిపించకుం డా వరద నీరు ప్రవహించింది. సీఈఆర్ క్లబ్, పాకిస్తాక్ క్యాంపు వద్ద గల పాలవాగు ఉప్పొంగి ప్రవహించింది. వర్షంతో చిరు వ్యాపారాలకు గిరాకీలు లేకుండాపోయాయి. వర్షం వల్ల గనులకు కార్మికుల హాజరు శాతం తగ్గింది. ఓసీపీల్లో వర్షంతో కొంత ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
మందమర్రిరూరల్: మండలంలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో ప్రజలు, వాహనదారులు, కూలీలు వర్షంతో ఇబ్బందులు పడ్డారు.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో ప్రజలు ఎవరు బయటకు రాలేదు. భారీ వర్షం కారణంగా పట్టణంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. మండలంలోని పలు గ్రామాల్లో పత్తిపంటకు తీవ్ర నష్టం కలిగింది.
జన్నారం: . మండలంలో కొద్దిపాటి వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి వర్షం కురవడంతో ప్రజలు బయటకు రాలేదు.
వెంటాడుతున్న వర్షాలు...ఆందోళనలో రైతులు
కాసిపేట, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి నల్లబడడంతో నష్టం వాటిల్లనుంది. వరి పొట్టదశలో ఉండడం వల్ల చీడపీడలు ఎక్కువగా ఆశిస్తున్నాయి. దీంతో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లనుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.