ముంపు ముంగిట ఎంసీహెచ్
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:49 PM
జిల్లా కేంద్రం లోని గోదావరి సమీపంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)కు వరద ముప్పు పొంచి ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 32 గేట్లను తెరిచి రెండు లక్షల పై చిలుకు క్యుసెక్కుల నీటిని అధికారులు దిగువన గోదావరిలోకి వదిలిపెడుతున్నారు.
- ఎల్లంపల్లి గేట్లు తెరవడంతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి
- ఆసుపత్రి భవనం చుట్టూ చేరిన వరద నీరు
- రోగులను జీజీహెచ్‌కు తరలిస్తున్న సిబ్బంది
మంచిర్యాల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం లోని గోదావరి సమీపంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)కు వరద ముప్పు పొంచి ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 32 గేట్లను తెరిచి రెండు లక్షల పై చిలుకు క్యుసెక్కుల నీటిని అధికారులు దిగువన గోదావరిలోకి వదిలిపెడుతున్నారు. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చగా ఎంసీహెచ్ భవనం చుట్టూ నీరు చేరింది. దీంతో అక్కడ చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణిలు బిక్కుబిక్కుమని గడుపుతుండగా వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2022 జూలై 13న కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి మాతా శిశు ఆసుపత్రి మొదటి అంతస్తు వరకు నీటిలో మునిగిపోయింది. దీంతో అప్పటి వరకు అక్కడ చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణిలను అర్ధరాత్రి హుటాహుటిన స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అదే సీను రిపీట్ అవుతుందేమోన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
- ప్రతి ఏటా ఇదే తంతు..
ఎంసీహెచ్ భవనం గోదావరి నదికి సమీపంలో ఉండడంతో ప్రతి ఏటా నది ఉప్పొంగినప్పుడల్లా ఆసుపత్రి ముంపునకు గురికావాల్సి వస్తుంది. ప్రతి ఏటా ముంపునకు గురికావడం, అందులో చికిత్స పొందుతున్న రోగులను తరలించడం కొన్నాళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.
- స్థల మార్పిడితోనే సమస్యకు పరిష్కారం..
గోదావరి సమీపంలో ఎన్‌సీహెచ్ భవనం నిర్మించడమే క్షమించరాని నేరంగా ప్రజలు బావిస్తున్నారు. ఆ స్థలంలో గతంలో కలెక్టరేట్ భవనం నిర్మించాలని ప్రతిపాదన వచ్చింది. అప్పుడు సాయిల్ టెస్ట్ చేసిన ఆర్‌అండ్‌బీ అధికారులు ముంపు ప్రాంతం కావడంతో కలెక్టరేట్ భవనానికి పనికిరాదని తేల్చిచెప్పారు. అయితే కాలక్రమంలో అదే స్థలాన్ని ఎంసీహెచ్‌కు కేటాయించడంపై భిన్నస్వరాలు వినిపించాయి. కలెక్టరేట్ భవనానికి పనికి రాని స్థలం మాతా శిశు ఆసుపత్రికి ఎలా ఎంపిక చేశారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీనికి తోడు ప్రతి ఏటా ఆసుపత్రి భవనం తరుచుగా ముంపునకు గురవుతుండడంతో స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు చొరవ మేరకు దానిని ఐబీ సమీపంలో నిర్మాణంలో ఉంది. ప్రస్తుత నిర్ణయమే సరైనదని, స్థల మార్పిడితోనే ఎంసీహెచ్ ముంపు సమస్యకు పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఆసుపత్రి భవనానికి అవసరమైన నిఽధులు రూ.350 కోట్లు(సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణాన్ని కలుపుకొని) నిధులు మంజూరు కూడా అయ్యాయి. దీంతో ఆసుపత్రి నిర్మాణం వేగం పుంజుకుంది. 2027 సంవత్సరంలో ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. ఆసుపత్రి నిర్మాణం త్వరగా జరిగి వైద్య చికిత్స ప్రారంభిస్తే వరద ముంపు నుంచి రోగులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.
- జిల్లా కేంద్రంలో నీట మునిగిన కాలనీలు
మంచిర్యాలక్రైం/మంచిర్యాల కలెక్టరేట్, (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల పట్టణంలో భారీ వర్షాలు కురువడంతో పలు కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. సూర్యనగర్, బృందావన్‌కాలనీ, హమాలీవాడ, అశోక్ రోడ్డు, హైటెక్‌సిటీ, 60ఫీట్ల రోడ్డులో వరద వల్ల జలమయ్యాయి. పలు వీధుల్లో కెనాల్ నిండి ఇళ్లలోకి వరద చేరింది. ముఖ్యంగా సూర్యనగర్ జలమయమైంది. ఎగువన ఉన్న దొరగారిపల్లె చెరువు, పోచమ్మ చెరువులు నిండి మత్తడి పారడంతో ఈ దుస్థితి నెలకొంది. గతంలో 10నుంచి 15 ఫీట్ల కెనాల్ ఉండగా గృహ నిర్మాణాలు చేపట్టి కెనాల్‌ను నాలుగు ఫీట్లకు కుదించడంతో వరద ముంపు ఎదురవుతున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బృందవన్‌కాలనీ, సూర్యనగర్ చెరువు శిఖం భూములు, బఫర్‌జోన్‌లో ఉండడం వల్లనే ప్రతీ సంవత్సరం ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు భారీ వర్షాలు కురిసినప్పుడు వరద పోయేందుకు తగినట్లు కెనాల్‌లు నిర్మించి ముంపు సమస్య పునరావృతం కాకుండా చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాతా శిశు ఆసుపత్రి వద్ద భారీ వర్షం వల్ల వరదనీరు చేరడంతో ఆసుపత్రికి వచ్చే సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరద వల్ల ఆసుపత్రి ఆవరణలోకి పాములు రావడంతో పలువురు భయభ్రాంతులకు గురయ్యారు.
బెల్లంపల్లిలో..
బెల్లంపల్లి (ఆంఽధ్రజ్యోతి): బెల్లంపల్లి పట్టణంతో పాటు మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు కాలనీలకు వరద నీరు చేరింది. కాల్‌టెక్స్ ఏరియాల్లో, రైల్వే స్టేషన్ రోడ్డులో రోడ్డు పక్కన భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే రాంనగర్ బ్రిడ్జి పై నుంచి వరదనీరు పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
మందమర్రి పట్టణంలో..
మందమర్రిటౌన్ (ఆంధ్రజ్యోతి): మందమర్రిలో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. స్థానిక మార్కెట్ సెంటర్‌లో ఆర్టీసీ బస్టాండ్ నుంచి వరద నీరు మార్కెట్ సెంటర్‌లోకి వచ్చింది. దీంతో మార్కెట్ బురదమయంగా మారింది. ఎంటీవీసీ నుంచి కేకే 5 బంగ్లాస్ వరకు వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహించింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని సీఈఆర్ క్లబ్ వద్ద గల పాలవాగు ఉప్పొంగి ప్రవహించింది. స్థానిక పాఠశాలలోకి వరద నీరు చేరింది. అంతేకాకుండా రైల్వేస్టేషన్ సమీపంలోని భాగ్యనగర్ కాలనీలోకి వరద నీరు చేరింది. స్థానిక రెండవ జోన్‌లోని క్వార్టర్లలోకి వరద నీరు చేరింది. స్థానికులు మున్సిపల్ కమీషనర్ రాజలింగుకు సమాచారం అందించడంతో ఆయన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సిబ్బందితో నీటిని తొలగింపజేశారు. వరద నీరు ప్రవహిస్తు కాలనీల్లో వార్డు ఆఫసీర్లు సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. పాలవాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఊరు రామకృష్ణపూర్‌లోని పంట పొలాల్లో వరద నీరు చేరింది. కేకే5 గని వెనకాల గల పాలవాగు పొంగడంతో గని అధికారులు వరద ఉధృతిని పరిశీలించారు. ఎటు చూసినా వర్షంతో జన జీవనం స్తంభించిపోయింది. చిన్నా చితక వ్యాపారులపై వర్షం ప్రభావం చూపించి వ్యాపారాలు సాగలేదు. వర్షాల దృష్య్టా మున్సిపల్ కమీషనర్ ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వ్యాధులు రాకుండా పారిశుధ్య పనులు తదితర చర్యలను తీసుకుంటున్నారు.
హాజీపూర్ (ఆంధ్రజ్యోతి): మండలంలో సోమవారం కురిసిన వర్షానికి రాపల్లి శివారులోని పంట పొలాలు నీటమునిగాయి. పందిళ్లు వేసిన బీర, కాకర తోటలు నేలకొరిగాయి. మూడు రోజులుగా కూరగాయల తోటల్లో నీరు నిలువడంతో తెగుళ్లభారిన పడి పంట నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఎడతెరపిలేకుడా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు చేరింది.
- కోతకు గురైనా కల్వర్ట్
నస్పూర్ (ఆంధ్రజ్యోతి): పట్టణంలో సోమవారం ఉదయం కురిసిన వర్షంతో వినూత్న కాలనీ-శ్రీశ్రీనగర్ మధ్య గల తోళ్లవాగుపై ఉన్న కల్వర్టు కోతకు గురైంది. కాలనీల మద్య రాకపోకలు నిలిచిపోయాయి. కాలనీ వాసులు కలెక్టరేట్ సమీపం నుంచి తిరిగి రావాల్సివస్తోంది. సీతారాంపల్లి రోడ్డులో ఎగువ నుంచి వరద ఎక్కువ రావడంతో ఒర్రె కల్వర్టుపై వరద ప్రవహిస్తోంది. కాలనీలోని కల్వర్టు వద్ద వరద ప్రవాహంలో గేదె కొట్టుకుని పోయి కొద్ది దూరంలో దిగువ ఒడ్డుకు చేరింది. ఇళ్లలోకి వరద నీరు వెళ్లకుండా చుట్టూ పక్కల ఒర్రె వద్ద చెట్ల పొదలు, పూడికను తొలగించే పనులను ఎక్స్‌కవేటర్ ద్వారా మాజీ చైర్మన్ సుర్మిళ్ల వేణు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.