గిరిజన ఆశ్రమ పాఠశాలలకు మహర్దశ
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:33 AM
గిరిజన ఆశ్రమ పాఠశాలల దశ మారనుంది. కొన్నేళ్ల నుంచి ఆశ్రమ పాఠశాలలకు నిధులు విడుదలకాక విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు.
- ఉమ్మడి జిల్లాకు రూ.11.73 కోట్లు నిధులు విడుదల
- పాఠశాలల్లో తీరనున్న సమస్యలు
వాంకిడి, జూలై 7(ఆంధ్రజ్యోతి): గిరిజన ఆశ్రమ పాఠశాలల దశ మారనుంది. కొన్నేళ్ల నుంచి ఆశ్రమ పాఠశాలలకు నిధులు విడుదలకాక విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. కనీస సౌకర్యాల కొరత, సంత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. గిరిజన ఆశ్రమపాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో గిరిజన ఆశ్రమ పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఊట్నూర్ పరిధిలోని కుమరంభీం, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని 149 ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న 34,910 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. వారికి అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు, బాత్‌రూం సౌకర్యాలు లేక విద్యార్థులు అనేక అవస్థలకు గురవుతున్నారు. దీంతో ఆశ్రమపాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖకు రూ. 11.73 కోట్లు నిధులు మంజూరు చేసింది.
- ప్రతీ సంవత్సరం ప్రతిపాదనలతోనే సరి....
విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే ఆశ్రమ పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలుకుతుంటాయి. ప్రతీ సంవత్సరం ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నతాధికారులకు వినతులు ఇవ్వడం మాములైంది. ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై ఐటీడీఏ ఆధీనంలోని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారులు ఏళ్లుగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖకు నివేదికలు పంపిస్తున్నారు. ప్రతీసారి విద్యాసంవత్సరం ప్రారంభంలో ఆశ్రమపాఠశాల సమస్యలపై అధికారుల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్న ఉన్నతాధికారులు నిధులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో కనీస సౌకర్యాల కల్పనకోసం నిధులను విడుదల చేసింది.
- తీరనున్న సమస్యలు
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలకు నిధులు విడుదల చేయడంతో పాఠశాలల్లో సమస్యలు తీరనున్నాయి. మంజూరైన నిధులతో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించనున్నారు. తొలుత అవసరమైన పాఠశాలల్లో మరమ్మతులు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తారు. తరగతి గదుల్లో లైటింగ్, వైరింగ్ బాగుచేస్తారు. పాఠశాల భవనాలు అందంగా ఆకర్షణీయంగా కన్పించేలా రంగులు వేయించనున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
- సకాలంలో పనులు పూర్తి అయ్యేలా చర్యలు
నజీమొద్దిన్, ఏఈ ఐటీడీఏ
ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు మంజూరైన నిధులతో పనులు ప్రారంభించాము. ప్రస్తుతం వాంకిడి, బంబార ఆశ్రమపాఠశాలల్లో పనులు కొనసాతున్నాయి. మిగితా పాఠశాలల్లోను సత్వరమే పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాము.
జిల్లా ఆశ్రమపాఠశాలలు విద్యార్థులు మంజూరైన నిధులు(రూ.కోట్లలో)
కుమరం భీం 50 10,921 3.64
ఆదిలాబాద్ 64 17,337 4.34
మంచిర్యాల 18 3,086 2.36
నిర్మల్ 17 3,566 1.39