‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:11 AM
స్థానిక సంస్థల ఎన్నికల పనులు వేగం పుంజుకున్నాయి. వివిధ కేటగరీలకు సంబంధించిన రిజర్వేషన్లను శనివారం లాటరీ పద్ధతి ద్వారా స్థానాల వారీగా ఖరారు చేశారు.
- బీసీలకు 42 శాతం అమలు
- తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
మంచిర్యాల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల పనులు వేగం పుంజుకున్నాయి. వివిధ కేటగరీలకు సంబంధించిన రిజర్వేషన్లను శనివారం లాటరీ పద్ధతి ద్వారా స్థానాల వారీగా ఖరారు చేశారు. రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆ తరువాత రెండు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలు ముగియగానే, స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పాలనపై పట్టు సాధించేందుకు కొంత సమయం పట్టింది. గ్రామ పంచాయతీల పాలన గత సంవత్సరం జనవరిలో ముగియగా, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పాలక వర్గాల పదవీకాలం జూలై నెలతో ముగిసింది. దీంతో స్థానిక సంస్థల పాలన ప్రత్యేకాఽధికారుల చేతుల్లోకి వెళ్లింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం సీట్లు కేటాయిస్తూ జీవో జారీ చేయడంతో ఆ మేరకు జిల్లా అధికారులు సైతం రిజర్వేషన్లు ఖరారు చేశారు.
ఫ బీసీలకు 42 శాతం అమలు...
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆ అధికారుల నివేదిక ప్రకారం.. పంచాయతీల్లో వార్డులు మొదలుకొని జడ్పీచైర్మన్ స్థానం వరకు క్షేత్రస్థాయిలో రిజర్వేషన్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే పూర్తయినందున జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేశారు. దీంతో ఇంతకాలం రిజర్వేషన్లు అనుకూలించక పోటీకి దూరంగా ఉన్న బీసీ సామాజిక వర్గాలకు ఆ అవకాశం లభించనుంది. రిజర్వేషన్లు మారడంతో సర్పంచ్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ఆశావహులు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే కుతూహలంతో ఉన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయడం ద్వారా రిజర్వేషన్లు పదేళ్ల వరకు ఉండేలా మార్పులు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లకోసారి రిజర్వేషన్లలో మార్పులు చేసేలా చట్ట సవరణ చేయడంతో ఆశావహులు పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వివిధ కేటగరీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించగా, సాంఘిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు.
రిజర్వేషన్లు ఇలా..
జిల్లాలో మొత్తం 16 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, అందులో 42 శాతం బీసీలకు కేటాయించారు. ఆ ప్రకారం ఏడు స్థానాలు బీసీలకు కేటాయించగా, రెండు స్థానాలు ఎస్టీలకు, నాలుగు స్థానాలు ఎస్సీలకు, మూడు స్థానాలను జనరల్ కేటగిరి వారికి కేటాయించారు. మొత్తం జడ్పీటీసీ స్థానాల్లో ఏడింటిని మహిళలకు కేటాయిచారు. అలాగే ఎంపీపీ 16 స్థానాలు ఉండగా, జడ్పీటీసీ మాదిరిగానే ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎంపీపీ మొత్తం స్థానాల్లో ఏడు సీట్లను మహిళలకు కేటాయించారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆ జాబితా కూడా విడుదలైతే ఆయా స్థానాల కేటాయింపుపైనా స్పష్టత రానుంది.
జిల్లాలో 306 పంచాయతీలు....
త్వరలో స్థానికసంస్థల ఎలక్షన్లకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో జిల్లాలోని 306 గ్రామపంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. గతంలో మొత్తం 311 గ్రామపంచాయతీలకు గాను హాజీపూర్ మండలంలోని ఐదు జీపీలను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో జీపీల సంఖ్య 306కు తగ్గింది. జిల్లాలో మొత్తం 16 మండలాలు ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 129 ఉన్నాయి. గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మున్సిపల్ కార్పొరేషన్‌లో మూడు స్థానాలు విలీనం అయ్యాయి. దీంతో వాటి సంఖ్య 127కు తగ్గింది. మళ్లీ కొత్తగా భీమిని, భీమారం మండలాల్లో అధనంగా రెండు ఎంపీటీసీ స్థానాలను పెంచారు. దీంతో మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్య 129కి చేరింది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనుండగా, అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి జిల్లాకు ఇప్పటికే చేరింది.