మద్యం వ్యాపారుల సిండికేట్
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:42 PM
రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండరు 2025-27లో భాగంగా జిల్లాలో 32 దుకాణాలకు ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.
- ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
- టెండరు దక్కించుకునేందు వ్యూహం
- గ్రూపుల ఏర్పాటు, టెండరు వేసేందుకు చర్యలు
- ముందస్తు ఒప్పందాలు చేసి పెట్టుబడులు పెడుతున్న వైనం
కాగజ్‌నగర్ టౌన్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండరు 2025-27లో భాగంగా జిల్లాలో 32 దుకాణాలకు ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆసిఫాబాద్ డివిజన్ లో 16, కాగజ్‌నగర్ డివిజన్‌లో 16 దుకాణాల కేటాయింపునకు అధికారులు టెండర్లు నిర్వహిస్తున్నా రు. కాగా ఇప్పటివరకు కాగజ్‌నగర్ డివిజన్‌లో-20 టెండర్లు, ఆసిఫాబాద్ డివిజన్‌లో-80 టెండర్లు దాఖలయ్యాయి.
కాగజ్‌నగర్‌లోని మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మరినట్లు తెలుస్తోంది. పట్టణంలో మద్యం వ్యాపారంలో కింగ్‌మేకర్లుగా ఎదిగిన కొంత మంది ముఠాగా ఏర్పడి గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ వ్యాపారులే ఆసక్తి ఉన్న వారితో అప్పులిచ్చి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. మూడు లక్షల రూపాయల నగదు ఇచ్చి టెండరు వేసేట్టు పలు రహస్య ఒప్పందాలు చేస్తున్నారు. ఇందుకు పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న వారు ఈ గ్రూపుల్లో చేరుతున్నారు. అయితే ఇందుకు పెట్టుబడి వీరిదే, టెండరులో దుకాణం వస్తే వీరు చెప్పిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే. వీరు ఎవరికి దుకాణం ఇవ్వాలన్న వారికి ఇవ్వాల్సిందే. ఒకవేళ దుకాణం రాకపోతే పెట్టుబడి డబ్బులు వాయిదా పద్ధతిలో ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకుంటున్నారు. మద్యం వ్యాపారుల మాయాజాలం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రక్రియతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం గండిపడే అవకాశాలుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి పలువురు వ్యాపారులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వాకబు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
- విదేశీ పర్యటనలు సైతం..
కాగజ్‌నగర్ డివిజన్‌లో కింగ్ మేకర్లు చెప్పింది వినాల్సిందే. లేదంటే తరుచూ రాష్ట్ర టాస్క్‌ఫోర్సు దాడులు జరిగేట్టు చేయటం, తరుచూ ఫిర్యాదులు చేస్తుండటంతో ఎందుకీగొడవ అనుకొని పలువురు వ్యాపారులు సర్దుకుపోతున్నారు. పలువురు వ్యాపారు లు ఆయా దుకాణాలకు సంబంధించిన మద్యం బాటిళ్లను బెల్టుషాపులకు తరలింపు చేయటం, ఎలాంటి సమస్యలు వచ్చిన కూడా వీరే పరిష్కరిస్తున్నారు. దీంతో ఈ వ్యాపారం వీరి కనుసన్నల్లోనే నడుస్తోంది. కాగా ఏ ఇతర వ్యక్తులు కూడా ఈ వ్యాపారంలోకి రాకుండా వీరే చూసుకుంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మద్యం దుకాణాల టెండరు ప్రక్రియపై ఇప్పుడు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వ్యాపారుల అడుగులపై పక్కాగా నిఘా పెడుతున్నారు. గ్రూపులో ఉన్న సభ్యులకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. ఇందులో కూడా విదేశీ పర్యటన ఖర్చులు కూడా భరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి వ్యాపారం చేజారకుండా ఉండేందుకు కూడా వీరు పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు రాకపోవటంతో అధికారులు కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.