Share News

రవాణా చెక్‌పోస్టుల ఎత్తివేత

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:02 AM

సరిహద్దులో రవాణాశాఖ చెక్‌పోస్టులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో ఎంఎస్‌ నంబర్‌ 58ని ఆగస్టు 28న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.

రవాణా చెక్‌పోస్టుల ఎత్తివేత
వాంకిడి చెక్‌పోస్టు

- జీవో జారీ చేసిన ప్రభుత్వం

- సిబ్బందికి మొబైల్‌ స్క్వాడ్‌ బాధ్యత

- ఆన్‌లైన్‌ సేవలపై అవగాహన కల్పించనున్న సిబ్బంది

వాంకిడి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సరిహద్దులో రవాణాశాఖ చెక్‌పోస్టులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో ఎంఎస్‌ నంబర్‌ 58ని ఆగస్టు 28న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. సరిహద్దుల్లోని చెక్‌పోస్టులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే చెక్‌పోస్టుల్లో విధలు నిర్వహిస్తున్న సిబ్బందికి ఆరునెలల పాటు మొబైల్‌ స్క్వాడ్‌ విధులు కేటాయించారు. ప్రధానంగా పన్ను చెల్లించకుండా రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రం నుంచి సరకు వాహనాలు రాకుండా చూడటమే వీరి విధి. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే అమల్లో ఉన్న ఆన్‌లైన్‌ వాహన్‌సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్రంలో కూడా అమల్లోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు ఆయా చెక్‌పోస్టుల్లో లభించే వివిధ రకాల సేవలను ఇకపై ఆన్‌లైన్‌లో జారీ చేసేలా ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగ పడనుంది. అలాగే చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్త్తున్న సిబ్బంది ఆరునెలల పాటు వాహన డ్రైవర్లకు ఆన్‌లైన్‌పై అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వం చెక్‌పోస్టులను తొలగిస్తూ జీవో జారీ చేసినప్పటికీ రవాణాశాఖ కమిషనర్‌ తదుపరి ఆదేశాల వరకు చెక్‌పోస్టుల్లో సిబ్బంది సేవలపై స్పష్టత రానుంది.

- వాహన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆన్‌లైన్‌ సేవలు

రవాణాశాఖ పరంగా చెక్‌పోస్టుల్లో అందించే సేవలను ఇకపై వాహన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా స్వచ్ఛందంగా పన్ను ఆన్‌లైన్‌ ద్వారా డ్రైవర్లు చెల్లించవచ్చు. తాత్కాలిక పర్మిట్‌, వలంటరీ ట్యాక్స్‌, స్పెషల్‌ పర్మిట్‌ సేవలను ప్రజలు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చు. వాహన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా పన్ను ఆన్‌లైన్‌లో చెల్లించేలా చెక్‌పోస్టు సిబ్బంది డ్రైవర్లకు అవగాహన కల్పించనున్నారు.

- ఉమ్మడి జిల్లాలో మూడు చెక్‌పొస్టులు..

రాష్ట్రవ్యాప్తంగా రవాణా చెక్‌పోస్టులు మొత్తం 15 ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మూడు రవాణా చెక్‌పొస్టులు ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో భోరజ్‌, నిర్మల్‌ జిల్లాలో భైంసా, ఆసిఫాబాద్‌ జిల్లాలో వాంకిడిలో సరిహద్దుగా రవాణాశాఖ చెక్‌పోస్టులు ఇప్పటివరకు సేవలు అందించాయి. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆయా చెక్‌పోస్టులను తొలగించనున్నారు. మొదటి ఆరు నెలలు మొబైల్‌ స్క్వాడ్‌ సిబ్బంది చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తారు. పన్ను చెల్లించని వాహనాలను రాష్ట్రంలోకి రాకుండా చూస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మూడు చెక్‌పోస్టుల్లో మొత్తం 21 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. భోరజ్‌ చెక్‌పోస్డులో 10 మంది, భైంసా చెక్‌పోస్టులో ముగ్గురు. వాంకిడి చెక్‌పోస్టులో 8 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

- అక్రమ రవాణా పెరిగే అవకాశం

ప్రభుత్వం సరిహద్దులోకి రవాణాశాఖ చెక్‌పోస్టులను తొలగించడంవల్ల అక్రమ రవాణా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చెక్‌పోస్టులు లేకపోవడంతో మధ్యం, ఇసుక, పశువులు, ఇతర వస్తువుల అక్రమ రవాణా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెక్‌పోస్టులు లేకపోవడంతో సరిహద్దులో పటిష్టమైన నిఘా లేని కారణంగా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు. సరిహద్దులో తనిఖీలు లేకపోవడంతో సరైన పత్రాలు లేకుండా ప్రయాణించడం, ఓవర్‌లోడ్‌తో వెళ్లడం, అసాంఘిక శక్తులు సులభంగా సరిహద్దులు దాటే అవకాశం ఉంది. దీంతో పాటు చెక్‌పోస్టుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే లక్షల రూపాయల ఆదాయానికి గండి పడనుంది.

Updated Date - Sep 02 , 2025 | 12:02 AM