Share News

బాబు జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో ముందుకు సాగుదాం

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:34 PM

స్వాతంత్ర సమరయోధుడు, దళిత జనబాంధవుడు, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచించారు.

బాబు జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
కలెక్టరేట్‌లో బాబుజగ్జీవ్‌రామ్‌ చిత్రపటానికి పూల మాల వేస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర సమరయోధుడు, దళిత జనబాంధవుడు, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచించారు. శనివారం బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్‌ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్‌ పాల్గొని జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దళితుల వికాసం కోసం నిర్విరామంగా కృషి చేసిన బాబు జగ్జీవన్‌ రామ్‌ ఆదర్శాలు అందరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కేంద్రమంత్రిగా, పార్లమెంట్‌ సభ్యుడిగా, భారత ఉపప్రధానిగా వివిధ పదవుల్లో దేశాభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. ప్రజా సంక్షేమంలో ఆదర్శాలను ఆచరణలో చూపిన మహనీయుడి చరిత్ర భావితరాలకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి సజీవన్‌, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, జిల్లా విద్యుత్‌ శాఖాధికారి శేషారావు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు కేశవరావు, ప్రాథమిక, వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అలీబీన్‌ అహ్మద్‌, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎంపీపీ అరిగెల నాగేశ్వర్‌రావు, కుల సంఘాల నాయకులు బ్రహ్మయ్య, రమేష్‌, శంకర్‌, మారుతి, జయరాజ్‌, గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 11:34 PM