భూ రికార్డులను డిజిటలైజ్ చేయాలి
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:39 PM
సర్వేలో భూ రికార్డులను డిజిటలైజ్ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అధికారులు, సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సర్వేలో భూ రికార్డులను డిజిటలైజ్ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అధికారులు, సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా కాడస్ర్టాల్ మ్యాప్‌లను నిర్వహించాలని, ప్రభుత్వం ఇచ్చిన నమూనా 1 నుంచి 6 వరకు సిద్దం చేయాలని తెలిపారు. లైసెన్స్ సర్వేయర్ మొదట ప్రభుత్వ భూమిని సర్వే చేస్తారని తెలిపారు. ఇనాం, అసైన్డ్ , లావుని పట్టా ఇతర ప్రభుత్వ భూములను నిర్ధారించాలని, అటవీ భూములను సర్వే నుంచి మినహాయించాలన్నారు. ఆరు మండలాల్లో పైలెట్ సర్వే, తొమ్మిది మండలాల్లో తొమ్మిది మంది ప్రభుత్వ సర్వేయర్లు, ప్రతీ మండలంలో లైసెన్స్ పొందిన సర్వేయర్లు ఆరు మంది సభ్యుల బృందం తమ పరిధిలోని గ్రామాల్లో కచ్చితమైన సర్వే చేయాలని తెలిపారు. అనాధికార నిర్మాణాలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ల్యాండ్ సర్వే అధికారి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
పొరపాట్లు లేకుండా ఎస్‌ఐఆర్ చేయాలి
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పెషల్ ఇంటన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)ను పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైద్రాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరిలుగా విభజించడం జరిగిందన్నారు. అన్ని కేటగిరీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల 33 లక్షల ఓటర్లను మ్యాపింగ్ చేశామన్నారు. మొదట మ్యాపింగ్ చేయబడిన కేటగిరి ఏ జాబితాను బీఎల్‌వో యాప్ ద్వారా నిర్ధారించుకోవాలని తద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్‌లో నమోదు చేయబడుతుందన్నారు. అనంతరం కేటగిరి సీ, డీలలోని ఓటర్లను కేటగిరి ఏకు మ్యాపింగ్ చేయాలని, ఈ ప్రక్రియను ఏఈఆర్‌వోల ఆధ్వర్యంలో సూపర్‌వైజర్‌లు, బీఎల్‌వోలు బీఎల్‌వో యాప్ ద్వారా వచ్చే శనివారం నాటికి పూర్తి చేయాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ బీఎల్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తామని, మొదటి కేటగిరి ఏ ఓటరు జాబితాను బీఎల్‌వో యాప్ ద్వారా నిర్ధారించిన తర్వాత కేటగిరి సీ, డీలను కేటగిరి ఏకు లింగ్ చేస్తామన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ చంద్రకళ, ఆర్డీవో శ్రీనివాసరావు, అధికారు లు పాల్గొన్నారు.