Share News

కేటీఆర్‌ విఫల నాయకుడు

ABN , Publish Date - Nov 18 , 2025 | 10:16 PM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఓ విఫల నాయకుడని, ఆయన నాయకత్వం వహించిన ఎన్నికలన్నీ ఓటమి చవిచూశాయని ఇటీవల జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో తమ పార్టీ విజయమే మరో నిదర్శనమని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డాక్టర్‌ జి వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

కేటీఆర్‌ విఫల నాయకుడు
బొక్కలగుట్ట వద్ద మాట్లాడుతున్న మంత్రి జి వెంకటస్వామి

- ఆయన నాయకత్వంలో అన్నీ ఓటములే

- స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీదే విజయం

- మంత్రి డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి

మందమర్రిటౌన్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఓ విఫల నాయకుడని, ఆయన నాయకత్వం వహించిన ఎన్నికలన్నీ ఓటమి చవిచూశాయని ఇటీవల జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో తమ పార్టీ విజయమే మరో నిదర్శనమని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డాక్టర్‌ జి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ఆయన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామకం అయిన నాటి నుంచి పార్టీ పతనపు అంచుల్లోకి చేరుకుందని పార్టీ కోలుకునే స్థాయిలో లేదన్నారు. మంగళవారం బొక్కలగుట్ట వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి ప్రజాప్రభుత్వం ఏర్పడడం తట్టుకోలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫాం హౌజ్‌కు పరిమితమయ్యాడని పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి కేటీఆర్‌ కుటుంబం కోట్లు గడిచిందని తెలిపారు. లెక్కలేని కుంభకోణాలు చేసి రాష్ర్టాన్ని దివాలా తీసేలా చేశారని విమర్శించారు. వీరి అవినీతి భాగోతం గురించి కేటీఆర్‌ చెల్లెలు కవిత పదేపదే ఆరోపిస్తున్నా జవాబు చెప్పడం లేదని వారు తప్పించుకు తిరుగుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్‌ ఉన్నప్పటికీ సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టిస్తూ పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లోని ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో సన్నబియ్యం పథకాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికలకు సంబంధించి తమ ప్రభుత్వంతోపాటు అభ్యర్థి నవీన్‌ యాదవ్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తూ బీఆర్‌ఎస్‌, బీజేపీలు రెండు జతకట్టి ఎన్నికుట్రలు చేసినా అవి ఫలించలేదన్నారు. రానున్నరోజుల్లో బీఆర్‌ఎస్‌ కనుమరుగవడం ఖాయమని పేర్కొన్నారు. స మావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పల్లె రాజు, పి రఘునాథ్‌రెడ్డి, ఎండీ అజీజ్‌, గాండ్ల సమ్మయ్య, వొడ్నాల శ్రీనివాస్‌, మహాంకాళి శ్రీనివాస్‌, బొలిశెట్టి కనకయ్య, ఎండీ ఇసాక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 10:16 PM