ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 06 , 2025 | 11:26 PM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగ వంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పొక్కూరు గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు, మే 6 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగ వంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పొక్కూరు గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని, జాబితాలో అర్హులు మాత్రమే ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో మాట్లాడి గ్రామంలో నెలకొన్న నీటిసమస్య వివరాలను తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, సుందరసాలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహారీ నిర్మాణ పనులను పరిశీలించారు. అంతకుముందు అంగ్రాజ్‌పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు నీడ, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజ్మత్ ఆలీ తదితరులు ఉన్నారు.
బార్ ఏర్పాటుకు డ్రా
నస్పూర్, మే 6 (ఆంధ్రజ్యోతి): బెల్లంపల్లి పట్టణంలో మూతపడిన బార్ స్థానంలో నూతన బార్ కోసం డ్రా పద్ధతిలో లబ్ధిదారుడిని ఎంపిక చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అబ్కారీ శాఖ పర్యవేక్షకుడు నందగోపాల్, ఎక్సైజ్ సీఐ గురువయ్యలతో కలిసి డ్రా పద్దతిలో లబ్ధిదారుడిని మంగళవారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బెల్లంపల్లిలో మూతబడిన బార్ స్థానంలో నూతన బార్ ఏర్పాటుకు నిర్వహించిన డ్రాలో గండ్ర దీక్షిత్‌రావు ఎంపికయ్యాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.