Share News

స్వతంత్రుల చూపు కాంగ్రెస్‌ వైపు...

ABN , Publish Date - Dec 20 , 2025 | 11:10 PM

పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రులుగా బరిలోకిదిగి సర్పంచ్‌లుగా విజయబావుటా ఎగురవేసిన నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నారా...? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

స్వతంత్రుల చూపు కాంగ్రెస్‌ వైపు...

-అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు

-ఇండిపెండెంట్లలో సింహభాగం రెబల్‌ అభ్యర్థులే

-ఇప్పటికే ఎమ్మెల్యేలతో టచ్‌లోకి సర్పంచ్‌లు

-ప్రమాణ స్వీకారం ముగియగానే ముహూర్తం

మంచిర్యాల, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రులుగా బరిలోకిదిగి సర్పంచ్‌లుగా విజయబావుటా ఎగురవేసిన నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నారా...? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం ఈవిషయం జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పంచాయతీ ఎన్నికలు జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన సంగతి తెలిసిందే. మొదటి విడుతలో మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని హాజీపూర్‌, లక్షెట్టిపేట, దండేపల్లి, ఖానాపూర్‌ నియోజక వర్గం పరిధిలోని జన్నారం మండలాల్లో ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోని తాండూరు, బెల్లంపల్లి, నెన్నెల, వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట మండలాల్లో నిర్వహించారు. మూడో విడతలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని కోటపల్లి, చెన్నూరు, భీమారం, జైపూర్‌, మందమర్రి మండలాల్లో జరిగాయి. ఆయా మండలాల పరిధిలోని మొత్తం 302 పంచాయతీల్లో ఎన్నికలు జరుగగా, మరో నాలుగు పంచాయతీలైన దండేపల్లి మండలం గూడెం, నెల్కి వెంకటాపూర్‌, వందురుగూడ, వేమనపల్లి మండలంలోని రాజారం గ్రామాల్లో రిజర్వేషన్లు వర్తించక ఎన్నికలు జరుగలేదు. ఆయా మండలాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోదిగి సర్పంచ్‌లుగా విజయం సాదించిన వారు 49 మంది ఉన్నారు.

ఫ అనేక మంది కాంగ్రెస్‌కు చెందినవారే..

స్వతంత్రులుగా సర్పంచ్‌ ఎన్నికల బరిలో దిగిన వారిలో కాంగ్రెస్‌ రెబల్‌గా పోటీచేసిన వారే అధికంగా ఉన్నారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తూ, ఆ పార్టీ మద్దతుతో సర్పంచ్‌ బరిలో దిగాలని భావించిన అనేక మందికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ అవకాశం లేకుండాపోయింది. చివరి క్షణంలో కాంగ్రెస్‌ మద్దతు లభించక పదులసంఖ్యలో అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. అలాంటి వారిపై కాంగ్రెస్‌ ముఖ్య నాయకులకు నమ్మకం లేకనో, ఇతరులు బలమైన అభ్యర్థులుగా భావించడం వల్లనో అదే పార్టీ నుంచి ఇతరులకు ఎన్నికల్లో అవకాశం కల్పించారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెబల్స్‌గా పోటీలో నిలిచి విజయం సాధించారు. అలా రెబల్స్‌గా బరిలోకి దిగిన వారు అనేక మంది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. ప్రస్తుతం వారంతా తిరిగి తమ మాతృ సంస్థకు వెళ్లాలనే ధృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఫ గ్రామాల అభివృద్ధికి సహకరించాలని...

జిల్లాలో నిర్వహించిన మూడు విడుతల సర్పంచ్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసి విజయం సాధించిన వారు 49 మంది ఉన్నారు. వారిలో సింహభాగం సర్పంచ్‌లు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధపడి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. తాము ఇంతకాలం పని చేసిన పార్టీలోనే కొనసాగాలనే నిర్ణయంతో అధిక శాతం మంది ఉండగా, ఇంతవరకు ఏ పార్టీతో సంబంధంలేని వారు కూడా అధికార పార్టీతో కలిసి నడిచేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే వారంతా ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వెళ్లగా ఈ నెల 22వ తేదీన ప్రమాణ స్వీకారం ప్రక్రియ ముగియగానే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకూడదంటే గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలి. అందుకు ముఖ్య వనరు నిధులు. ప్రతిపక్షంలో ఉంటే సక్రమంగా నిధులు రావని, అదే అధికార పార్టీలో చేరితే ఎమ్మెల్యేల కనుసన్నల్లో పని చేయడం ద్వారా సరిపడా నిధులు తీసుకువచ్చే అవకాశాలుంటాయన్న భావనలో స్వతంత్రంగా గెలిచిన సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికార పార్టీలో తమకు సరైన గుర్తింపును ఇవ్వడంతోపాటు గ్రామాల అభివృద్ధికి సహకరించాలనే డిమాండ్‌లను ఎమ్మెల్యేల ముందు ఉంచుతున్నట్లు తెలుస్తోంది.

ఫ పరిషత్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని..

ఎమ్మెల్యేలు కూడా పార్టీని గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు ప్రజల మద్దతున్న సర్పంచ్‌లను చేర్చుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా గ్రామస్థాయి నుంచి తమ బలాన్ని మరింత పెంచుకోవాలనే భావనతో ఉన్నారు. మరోవైపు త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించాలంటే సర్పంచ్‌ల అవసరం ఎమ్మెల్యేలకు తప్పనిసరి కానుంది. ఇందుకోసమైనా స్వంత్రంగా గెలుపొందిన వారిని చేర్చుకొనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 20 , 2025 | 11:11 PM