చదువులు సాగేదెలా ?
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:02 AM
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా సమస్యలు ఇంకా విద్యార్థులను వేధిస్తూనే ఉన్నాయి. బడిబాట కార్యక్రమంతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థులు చేరారు.
- హెచ్‌ఎంలకు మధ్యాహ్న భోజన పథకం అదనపు బాధ్యతలు
- బోధనపై దృష్టి సారించలేకపోతున్న ప్రధానోపాద్యాయులు
- ‘మన ఊరు- మన బడి’ నిలిచిపోవడంతో ఇబ్బందులు
- ప్రైమరీ టీచర్ల భర్తీపై దృష్టిసారించని ప్రభుత్వం
మంచిర్యాల, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా సమస్యలు ఇంకా విద్యార్థులను వేధిస్తూనే ఉన్నాయి. బడిబాట కార్యక్రమంతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థులు చేరారు. అయినప్పటికీ ముఖ్యమైన సమస్యలు ప్రభుత్వ పాఠశాల విద్యారంగాన్ని వేధిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు అదనపు భారం మోయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు పాఠ్యాంశ సంబంధిత విధులు నిర్వహిస్తుండగా, అదనంగా మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతలు కూడా మోయాల్సి వస్తోంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రారంభించిన మన ఊరు- మనబడి పథకం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజనంలో నాణ్యతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటంతో అకాడమిక్ పనులు నిర్వహించవలసిన ప్రధానోపాధ్యాయులు పూర్తిగా మధ్యాహ్న భోజనం నిర్వహణపై దృష్టి సారించాల్సి వస్తోంది. ఆహారంలో నాణ్యత లేకపోయినా, మెనూ పాటించకపోయినా, ఆహార కల్తీ జరిగి విద్యార్థులు అనారోగ్యం పాలైనా ప్రధానోపాధ్యాయుల్ని బాధ్యులను చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అదనపు బాధ్యతలు ప్రధానోపాధ్యాయులకు కత్తిమీద సాములా తయారయ్యాయి. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, సరుకుల ధరలకు అనుగుణంగా రేట్లు పెంచకపోవడం వంటి సమస్యలతో నిర్వాహకులు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించే పరిస్థితి లేదు. దాని ఫలితం తమపై ప్రభావం చూపనుండటంతో ప్రధానోనాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
- నిలిచిన మన ఊరు-మన బడి...
ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు తొలగించడానికి గత ప్రభుత్వ హయాంలో మన ఊరు-మన బడి పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ నిధులతో పనులు చేపట్టవలసి ఉంది. ఇందులో అదనపు తరగతి గదుల నిర్మాణం, వంట గదుల నిర్మాణం, ప్రహరీలు, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం, గేట్ల ఏర్పాటుతోపాటు అవసరమైన చోట మరమ్మతు పనులు చేపట్టవలసి ఉంది. పథకం కింద జిల్లాలో మొత్తం 246 పాఠశాలలను ఎంపిక చేయగా, రూ. 56 కోట్లకు పరిపాలనా అనుమతులు కూడా మంజూరయ్యాయి. ఇందులో దాదాపు రూ. 22 కోట్లతో 134 పాఠశాల పనులు పూర్తికాగా, మిగిలిన సొమ్ము చెల్లించకపోవడంతో మరో 112 పాఠశాల్లో పనులు నిలిచిపోయాయి. మిగిలిన నిధుల కోసం విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. ఆ నిధులు విడుదల అయితే తప్పా.... మిగిలిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు లేవు.
- మెనూ అమలు కష్టమేనా?
మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మెనూ అమలు చేయడం కష్టసాధ్యమనే అభిప్రాయాలు ఉన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా సరుకుల రేట్లు పెంచకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మెనూ ప్రకారం భోజనంలో భాగంగా వారానికి మూడు రోజులు గుడ్డు, రెండు రకాల కూరగాయలు, సాంబారు, వారంలో ఒకరోజు వెజ్ బిర్యాణీ, కిచిడీ అందించాల్సి ఉంది. ఈ మెనూ పాటిం చాలంటే ఒక్కో విద్యార్థికి రోజుకు కనీసం 15 రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రభుత్వం చెల్లి స్తున్నది రూ. 6.10 పైసలు మాత్రమే కావడంతో ఇబ్బందులు పడుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నా రు. అలాగే గుడ్డు ధర మార్కెట్‌లో ప్రస్తుతం రూ. 6.30 పైసలు ఉండగా, ప్రభుత్వం ఆరు రూపాయలు చెల్లి స్తోంది. ప్రైమరీ విద్యార్థులకు 15 రూపాయలు, హైస్కూల్ విద్యార్థులకు 20 రూపాయల చొప్పున మెనూ చార్జీలు పెంచితే నాణ్యమైన భోజనం అందిం చేందుకు వెసులుబాటు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గత విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి, ఏప్రిల్ నెలల బిల్లులు పెండింగులో ఉన్నాయి. అలాగే కోడిగుడ్ల బిల్లులు దాదాపుగా ఐదు నెలలవి రావాల్సి ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వాటితోపాటు నెలవారీ వేతనాలు కూడా మార్చి, ఏప్రిల్ నెలలవి బకాయి ఉన్నాయి. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు నెలకు మూడు వేల రూపాయల వేతనం ఇవ్వాల్సి ఉంది. గత సంవత్సరం నవంబరు నుం చి ఏప్రిల్ వరకు ఆరు నెలల పాటు పాఠశాలల్లో అల్పాహా రం సౌకర్యాన్ని ప్రభుత్వం క ల్పించింది. ఇందుకు గానూ ప్రతిరోజు ఒక్కో విద్యార్థికి 10 రూపాయల చొప్పున మధ్యాహ్న భోజన నిర్వాహకులకు చెల్లించాల్సి ఉండగా, ఆరు నెలలకు సంబంధించిన ఆ బిల్లులు కూడా చెల్లిం చలేదని చెబుతున్నారు.
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 535, ప్రాథమికోన్న త పాఠశాలలు 116, ఉన్నత పాఠశాలలు 98 ఉన్నాయి. వాటిలో 37,171 మంది విద్యార్థులు చదువుతుండగా, వారందరికీ మధ్యాహ్నభోజనం అందించవలసి ఉన్నది. బిల్లులు సక్రమంగా అందకపోవడం, ప్రభుత్వం నిర్ణ యించిన ధరలకు మార్కెట్‌లో సరుకులు రాకపోవ డంతో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిం చడంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ప్రధానో పాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
- ప్రాథమిక పాఠశాలల సమస్యలు తీరెదెన్నడు?
ప్రాథమిక పాఠశాల్లో సమస్యలు ఎప్పుడు తీరుతాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయుల నియామ కం చేపట్టవలసి ఉంది. సింగిల్‌టీచర్ ఉన్నచోట సెలవు పెట్టినప్పుడు ఇతర పాఠశాలల నుంచి డిప్యూ టేషన్‌పై సర్దుబాటు చేస్తున్నారు. 60మంది విద్యార్థులు ఉన్నచోట ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉంది. అదే 60 మంది లోపు విద్యార్థులు ఉన్నచోట కేవలం ఇద్దరు ఉ పాధ్యాయులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆ ఇద్దరే ఐదు తరగతులకు బోధించాల్సి వస్తున్నది. ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని ఉపా ధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తు న్నాయి. ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అయితేనే అవి మనుగడ సా ధించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో సమస్యల ను పరిష్కరించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.