Share News

ఏకగ్రీవంపై ఆశలు

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:29 PM

పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్‌ రానున్నది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిచడానికి కసరత్తు మొదలైంది.

ఏకగ్రీవంపై ఆశలు
2019 ఎన్నికల్లో ఏకగ్రీవమైన చింతలమానేపల్లి మండలంలోని ఆడెపల్లి పంచాయతీ

- ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సాహం

- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన

- గత ప్రభుత్వంలో రావాల్సిన బకాయిలు రూ.7.35 కోట్లు

ఆసిఫాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్‌ రానున్నది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిచడానికి కసరత్తు మొదలైంది. పాత పద్ధతిలో 50శాతం కోటా మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేశారు. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పల్లెలో పోటీకి సిద్ధమైన ఆశావహులు హడావుడి జోరందుకుంది. ప్రభుత్వం డిసెంబరులో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. వివిధ రాజకీయ పార్టీలు కుడా స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టడంతో పల్లెల్లో రాజకీయ సందడి మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో పదవులు కైవసం చేసుకోవాలని ఆశతో ఉంటే గ్రామాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటలతో మరోసారి ఏకగ్రీవ పంచాయతీలు చర్చకు దారితీసింది.

- అప్పులు చేసి అభివృద్ధి పనులు..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకగ్రీవ ఆశలు ముందుకు తీసుకొచ్చింది. వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలంతా చర్చించుకొని సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ పంచాయతీలకు 10 లక్షల రూపాయల గ్రాంట్‌ ఇస్తామని వెల్లడించారు. కాని జిల్లాలో ఏకగ్రీవాలపై అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 2019 ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల రూపాయల ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించి నయా పైసా కూడా ఇవ్వలేదు. పదవీకాలం ముగిసినా పోత్సాహం అందలేదు. సర్పంచ్‌, పాలకవర్గం ఏకగ్రీవ నిధులు, ప్రభుత్వం అందించే నిధులతో బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు ఉండవని భావించి అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన వారికి నిరాశే మిగిలింది. బిల్లులు రాక కనీసం అందిస్తామన్న ప్రోత్సాహం నిధులు రాక అప్పుల పాలయ్యారు.

- గడువు ముగిసి రెండేళ్లయినా..

2019లో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 500 జనాభా కలిగిన తండాలను, గూడాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. వాటిని అభివృద్ధి పథంలో నడిపించాలనే సంకల్పంతో గ్రామ పంచాయతీలను ఏకగీవ్రంగా ఎన్నుకుంటే నజరానా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కుమరం బీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 335 పంచాయతీలు ఉండగా 49 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేసుకున్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించడంతో పాటు ఎమ్మెల్యే నిధుల నుంచి అదనంగా మరో ఐదు లక్షల రూపాయలు కలిపి మొత్తం 15 లక్షల రూపాయల నజరానాను ప్రకటించింది. దీంతో జిల్లాలో మొత్తం రూ7.35 కోట్ల నజారానాలు రావాల్సి ఉంది. 2019 గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసిపోయి రెండేళ్లవుతున్నా నిధులు మాత్రం విడుదల కాలేదు.

- గత ఎన్నికల్లో 49 పంచాయతీలు ఏకగ్రీవం..

2019 ఎన్నికల్లో జిల్లాలోని 335 గ్రామపంచాయతీలు ఉండగా 286 గ్రామపంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. 49 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. కౌటాల మండలంలో తలోడి, కన్కి, శిర్సా, నవేగాం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. బెజ్జూరు మండలంలో అంబగట్టు, సుస్మీర్‌, కాటేపల్లి, తలాయి, సులుగుపల్లి, అందుగులగూడ, కుకుడ, పెంచికలపేట మండలంలో కొండపల్లి, మొర్లిగూడ, దహెగాం మండలంలో ఐనం, దిగిడ, రాంపూర్‌, చింతలమానేపల్లి మండలంలో ఆడెపల్లి, తిర్యాణి మండలంలో భీంజిగూడ, గోవెన, మర్కగూడ, గోపెర(నాగుగూడ), మొర్రిగూడ, గుండాల, ముల్కలమంద పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

రెబ్బెన మండలంలో తక్కళ్లపల్లి, కాగజ్‌నగర్‌ మండలంలో అనుకోడ, భట్టుపల్లి, ఈసుగాం, జగన్నాథ్‌పూర్‌, లైన్‌గూడ, రేగులగూడ, కెరమెరి మండలంలో కరంజీవాడ, రింగన్‌ఘాట్‌, వాంకిడి మండలంలో దాబా, నవేగూడ, పాటగూడ, పిప్పర్‌గొంది, సవ్వాతి, సిర్పూర్‌(యూ) మండలంలో బాండేయర్‌, సీతాగొంది, లింగాపూఏర్‌ మండలంలోని గుమ్నూర్‌(బి), చిన్నదాంపూర్‌, జైనూరు మండలంలో రాంనాయక్‌తండా, దుబ్బగూడ, మార్లవాయి, పారా, పవర్‌గూడ, రాశిమెట్ట, ఊసేగాం పంచాయతీలు ఏకగ్రీవమై ప్రోత్సాహనికి అర్హతగా నిలిచాయి. కానీ ప్రోత్సాహక నిధులు మాత్రం రాలేదు. మరోసారి ఏకగ్రీవ పంచాయతీల ప్రోత్సాహక అంశాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది.

Updated Date - Nov 24 , 2025 | 11:29 PM