భారీ వర్షం.. అతలాకుతలం
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:10 AM
జిల్లాలో బుఽధవారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షానికి తోడు ఎగువున కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
- ఉప్పొంగిన వాగులు, వంకలు
- ఎల్లంపల్లి వరదతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి
- జిల్లా కేంద్రంలో ఉప్పొంగి ప్రవహించిన రాళ్లవాగు
- పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వరద
- సహాయక చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం
మంచిర్యాల, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుఽధవారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షానికి తోడు ఎగువున కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గరిష్ట మట్టం 148 మీటర్లకుగాను 146.58 మీటర్లకు నీరు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకుగాను 16.336 టీఎంసీలకు నీరు చేరింది. నిర్మల్ జిల్లాలోని కడెం రిజర్వాయర్ ఆరు గేట్లు ఎత్తినీటిని విడుదల చేస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు చేరడంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి 8,28,520 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. జిల్లా కేంద్రంలోని పుష్కరఘాట్ మునిగి వరద సమీపంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్దకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అందులో చికిత్స పొందుతున్న బాలింతలు, గర్భిణులను ఆర్టీసీ బస్సులు, ఆంబులెన్స్‌ల్లో స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. గోదావరి నిండుగా ఉధృతంగా ప్రవహించడంతో జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు ఉప్పొంగి, సమీపంలోని ఎన్టీఆర్ కాలనీ, రాంనగర్, ఎల్‌ఐసీ కాలనీ, ఆదిత్య ఎన్‌క్లేవ్ సమీపంలోని ఇళ్లలోకి చేరింది. దీంతో ముందస్తు చర్యలు చేపట్టిన కలెక్టర్ కుమార్ దీపక్ నేతృత్వంలో తహసీల్దార్ రఫతుల్లాఖాన్, ఇతర అధికారులు ప్రజలను స్థానికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. కలెక్టర్ జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరం, మాతా శిశు ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.
- ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం...
బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా జిల్లాలో ని సింగరేణి ఏరియాలైన శ్రీరాంపూర్, మందమర్రి, గోలేటిలలోని ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఓసీపీల్లో నీరు చేరడంతో భారీ వాహనాలు ఉపరితలానికే పరిమితం అయ్యాయి. వర్షాల కారణంగా ఓవర్ బర్డెన్ పనులు కూడా నిలిచిపోయాయి.
దండేపల్లి: ఎడతెరిపి లేకుండా కురిసిన బారీ వర్షాలకు దండేపల్లి మండలంలోని వాగులు, వంకలు ఉప్పొంగాయి. గ్రామాల్లో లోతట్టు ప్రాంతంలోని ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో నాన ఇబ్బంది పడ్డారు. వాగులు వంకలు పొంగి పొళ్లి చెరువులు, కుంటలు నిండుపోయాయి. మండలంలోని కొర్విచెల్మ సమీపంలో ఉన్న లోలెవల్ వంతెనపై వరద నీరు పొంగిపోర్లడంతో కోర్విచెల్మ ముత్యంపేట మధ్య రాకపోకలు నిలిచిపో యాయి. చింతపల్లి నుంచి కుందేళ్లపహ్లడ్ వెళ్లే రోడ్డు వరద నీరు ప్రవాహంతో రోడ్డు కోతకు గురై రాకపోక లు నిలిచిపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మదాపూర్, నర్సాపూర్ గ్రామాలకు వెళ్లే రహదారిలో లోలెవల్ వంతెనపై వరదనీరు పొంగి పొర్లుడంతో గ్రామాల మధ్య ప్రజలు, వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షల కారణంగా దండేపల్లి తహసిల్దార్ రోహత్ దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్, ఎస్సై తాహసినోద్దీన్, ఆర్‌ఐ భూమన్న, మండ లస్ధాయి అధికారులు, సిబ్బంది వరదల ప్రభా వంపై ప్రజలను అప్రమత్తం చేశారు. దండేపల్లిలో మాడేల య్య స్వామి ఆలయాన్ని వరద నీరు చుట్టు ముట్టింది.
జన్నారం: రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండలం అతలాకుతలం అయింది. మండలంలోని రోటిగూడకు వెళ్లే ప్రఽధాన రహదారికిగల ప్రధాన వంతె నపై వాగు ఉప్పొంగి ప్రవహించింది. జన్నారం వాగు ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు లోతట్టు ప్రాంత వాసులందరినీ స్థానిక ఆశ్రమ పాఠశాల, పీఆర్‌టీయూ భవన్‌లోకి పంపించారు. మండలంలోని 12 డిస్ర్టిబ్యూటర్ కడెం కెనాల్ కాల్వలోకి నీరు అధికం గా చేరడంతో మొర్రిగూడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల ఇళ్లలోకి నీరు చేరింది. పాతపొన్కల్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తాటిచెట్టుపై పిడుగు పడడంతో సమీపంలో ఉన్న పి లచ్చన్న ఇంటి స్లాబ్‌పై పెచ్చులు ఊడి విద్యుత్ తీగలు కాలిపోయాయి. శ్రీలం కకాలనీలోకి నీరు చేరడంతో తహసీల్దార్ రాజమనోహ ర్‌రెడ్డి, ఎంపీడీవో ఉమర్ షరీఫ్ వెళ్లి దగ్గర ఉండి చర్య లు చేపట్టారు. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తిమ్మాపూర్ గ్రామంలో పాఠశాలలోకి భారీగా నీరు చేరింది. మరికొ న్ని ప్రాంతాల్లో పంటపొలాల్లోకి నీరుచేరడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేరుకొని స్థాని క ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం తిమ్మాపూర్, రోటిగూడ, పలు ప్రాంతాల్లో సందర్శించారు.
కడెం కెనాల్‌లో పడి యువకుడి మృతి..
మండలంలోని మొర్రిగూడె గ్రామానికి చెందిన బాదావత్ గంగాధర్(25) అనే యువకుడు బుధవారం కడెం కాలువలో పడి మృతి చెందాడు. రోజువారీ లాగే బుధవారం కూలీపనికి వెళ్లి సాయంత్రమైనా గంగాధర్ తిరిగి రాకపోవడంతో మృతుడి భార్య మంజులతో పాటు బం ధువులు స్థానికంగా వెతకారు. ఈ క్రమంలో వెతకగా స్థానిక కడెం కెనాల్ 12వ డిస్ర్టిబ్యూటరీ కాలువలో మృతి చెంది కనిపించాడు. బుధవారం రాత్రి కాలువ లో ప్రమాదవశాత్తు కాలు జారిపడి ఉంటాడని కేసు నమోదు చేస్తున్నామని ఎస్‌ఐ అనూష తెలిపారు.
జైపూర్: మండలంలోని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ వనజారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీవో సత్యనారాయణ, ఎస్‌ఐ శ్రీధర్‌లతో కలిసి ఇందారం, కిష్టాపూర్, వేలాల, పౌనూరు, శివ్వారం గోదావరి పరివాహక ప్రాంతాలను సందర్శించారు.
- గోదావరికి వరద ఉధృతి..
దండేపల్లి: రెండు రోజుల నుంచి ఏకదాటిగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గూడెం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది. మండలంలోని గోదావరి నది అనుకోని ఉన్న గుడి రేవు, లక్ష్మికాంతపూర్, ద్వారక, కొండాపూర్, కాసిపేట, వెల్గనూర్, నంబాల, గూడెం గ్రామాలోని వరద నీరు పంటపోలాలకు రావడంతో వందలాది ఎకరాల పత్తి, వరి పంటలు నీటమునిగాయి.
‘ఎల్లంపలి’్లపై సీఎం ఏరియల్ సర్వే
హాజీపూర్: రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గురువారం హెలీకాప్టర్‌లో ఎల్లంపల్లి ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అవతలివైపు ఉన్న గోలివాడ వద్ద హెలీక్యాప్టర్ దిగి కాన్వాయితో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిశీలించిన అనంతరం అధికారులతో ప్రాజెక్టు వివరాలను తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ కుమార్‌గౌడ్ ఉన్నారు. వరద పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం 24/7 అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాస్‌లు, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, రూరల్ సీఐ ఆకుల అశోక్‌లు అప్రమత్తమయ్యారు. ఇరిగేషన్ సీఈ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాస్ గుప్తా, ఈఈ వెంకటయ్య, డీఈ బుచ్చిబాబు, శరత్‌బాబు పాల్గొన్నారు.