కులవృత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:02 AM
కుల వృత్తులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రోత్సహిస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.
-ఎమ్మెల్యే గడ్డం వినోద్
కాసిపేట, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కుల వృత్తులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రోత్సహిస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం కాసిపేట మండలం ముత్యంపల్లికి చెందిన ముద్దం రాధకు సంచార చేపల విక్రయ వాహనాన్ని అందజేసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మండలంలోని ఐదు గ్రామాలకుచెందిన 118 మంది రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందజేశారు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన ద్వారా మంజూరైన రూ. 57.39 లక్షల విలువ గల టార్పాలిన్, స్ర్పే బ్యాటరీలు, ఆయిల్ ఇంజన్‌లు, పవర్ వీడర్, కరెంటు మోటారు, కల్టీవేటర్, సోలార్ ఫెన్సింగ్ కిట్‌లను లబ్దిదారులకు అందించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో కిషన్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డీపీఎం రాజబాబు, ఏపీఎం రాజ్‌కుమార్, పీవో వెంకటకృష్ణ , స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పేదలకు అండగా కాంగ్రెస్
బెల్లంపల్లి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పేదలకు అండగా ఉండి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసి మాట్లాడారు. ప్రజల అభివృద్ది కోసం వివిధ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని అర్హులైన ప్రతీఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు చిలుముల శంకర్, బండి ప్రభాకర్, రాయలింగు, మల్లయ్య, తహసీల్దార్ క్రిష్ణ, నాయకులు పాల్గొన్నారు.