Share News

గోండు బెబ్బులి

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:46 PM

ఆదివాసీ గిరిజనుల హక్కుల సాధన కోసం నైజాంకు వ్యతిరేకంగా సమర భేరి మోగించిన యోధుడు.. నిజాం నిరంకుశ పాలనలో గిరిజనులకు జరుగుతున్న అన్యా యాలపై ఎలుగెత్తిన వీరుడు.. జల్‌.. జంగల్‌.. జమీన్‌( భూమి, నీరు, అడవి) హక్కుల కోసం చేసిన పోరాటంలో అమరుడై గిరిజనుల ఆరాధ్య దైవమయ్యాడు కుమరం భీం.

గోండు బెబ్బులి

- జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదంతో నిజాం సర్కారుపై సమరం

- భీం స్ఫూర్తితో రజాకార్లతో పోరాడిన యువకులు

- ఆ మహనీయుడి పోరాట ఫలితంగానే ఆదివాసీలకు హక్కులు

- నేడు కుమరం భీం వర్ధంతి

- జోడేఘాట్‌లో ఏర్పాట్లు పూర్తి

ఆసిఫాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ గిరిజనుల హక్కుల సాధన కోసం నైజాంకు వ్యతిరేకంగా సమర భేరి మోగించిన యోధుడు.. నిజాం నిరంకుశ పాలనలో గిరిజనులకు జరుగుతున్న అన్యా యాలపై ఎలుగెత్తిన వీరుడు.. జల్‌.. జంగల్‌.. జమీన్‌( భూమి, నీరు, అడవి) హక్కుల కోసం చేసిన పోరాటంలో అమరుడై గిరిజనుల ఆరాధ్య దైవమయ్యాడు కుమరం భీం. ఓ వైపు దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటం మహోద్యమంగా కొనసాగుతుంటే.. మరో పక్క తెలంగాణలో నిజాం నిరంకుశత్వం.. రజాకార్ల ఆగడాలపై తిరుగుబాట్లు జరుగుతున్న రోజులవి. ఈ రెండు ఉద్యమాలకు సమాంతరంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో కుమరం భీం నాయకత్వంలో గిరిజనుల స్వాతంత్య్ర పోరాటం కొనసాగింది.

- ఆదివాసీ బిడ్డలపై..

ఆదివాసీ బిడ్డలపై అమానుష నిర్భందానికి వ్యతిరేకంగా కర్షక నిజాం సర్కార్‌పై జల్‌ జంగల్‌ జమీన్‌ నినాదంతో జంగు సైరన్‌ ఊదిన ఆదివాసీ నిప్పుకణిక కుమరం భీం ఈ లోకాన్ని విడిచి ఇప్పటికి 85 వసంతాలు పూర్తయ్యాయి. అడవి బిడ్డల ఆత్మస్థైర్యాన్ని శిఖర స్థాయికి చేర్చి తను కనుమరుగైపోయినా తను నింపిన స్పూర్తిని, ధైర్యాన్ని అడవి బిడ్డలు నేటికీ తలుచుకుంటూనే ఉన్నారు. ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజున ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. శిస్తు(పన్నులు) పేరుతో ఆదివాసీలపై నిజాం అనుచరులు చేస్తున్న ఆగడాలను సహించలేక సాయుధ పోరే సమస్యకు పరిష్కారమని నమ్మి 1940కి ముందే జోడేఘాట్‌ పోరాట గడ్డపై తుపాకీ ఎక్కు పెట్టాడు. తనదైన గెరిల్లా వ్యూహాలతో నిజాం సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టి నైజాం అల్లూరిగా నిజాం గుండెల్లో నిద్ర పోయాడు. నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేయక ముందే జిల్లాలో కుమ్రం భీం తుపాకీ చేత పట్టి ఉద్యమానికి సిద్దమయ్యాడు. భీం పోరాట స్పూర్తితోనే 1948లో నిజాం ప్రభువుపై భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్యకు మద్దతుగా రజాకార్లతో ఎంతో మంది యువకులు సాయుధ పోరాటానికి దిగారు. జాగీరుదారుల అణచివేత, అత్యాచారాలు, ఆగడాలను తట్టుకోలేక తనతో కలిసి పెరిగిన అడవి బిడ్డలనే అనుచరులుగా మార్చుకుని వారికి సాయుధ శిక్షణ ఇవ్వడం ద్వారా నిజాం సైనికులను ఓడించినంత పని చేశారు. అడవిలో పుట్టిన గిరిజనులు ప్రకృతి సంపదను అనుభవించకుండా దోపిడీ చేస్తున్న దళారీలు, వ్యాపారులు, అటవీ అధికారుల వ్యవస్థకు నిరసనగా ఎదురు తిరిగారు. అడవిలో కట్టెలు కొట్టకూడదని, పశువులు మేపకూడదని, భూము లు దున్నకూడదని నిజాం ప్రభుత్వం ఆంక్షలు విధించడంను భీం సవాలు చేయడమే కాకుండా వారి ఆదేశాలను ధిక్కరించారు.

- చిన్నతనం నుంచే తిరుగుబాటు

భీం స్వగ్రామం ఆసిఫాబాద్‌ మండలం సంకెపల్లి గ్రామం. భీం తండ్రి ఆయన బాల్యంలో మరణించారు. దీంతో పదిహేనవ ఏటా కుటుంబ, గ్రామ పెద్దగా బాధ్యతలు చేపట్టారు. నిజాం పోలీసుల, అటవీ అధికారుల ఆగడాలను సహించలేక పోయారు. తన చిన్నతనంలో భీం సోదరులు అటవీ శాఖ సిబ్బందితో పడుతున్న గొడవలకు కారణాలను తెలుసుకున్నారు. వారిని ఎదురించడం ప్రారంభించారు. ఇదే క్రమంలో అక్కడి సమకాలిక సమస్యలు, కారణాలపై అవగాహన పెంపొందించుకున్నాడు. శతాబ్దాలుగా తాము అనుభవిస్తున్న అటవీ, సహజ సంపదలపై నిజాం సర్కా రు పన్నులు వసూలు చేయడం, ఈ నెపంతో చౌకీదార్లు, పట్వారీలు గోండు గూడేల పైబడి దోచుకోవడం, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం భీంను కలచి వేశాయి. దీంతో ఆయన స్థానికంగా ఉన్న జమీందార్లు, చౌకీదార్లపై నిజాం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్‌ వెళ్లాడు. కానీ నిజాం ప్రభువు అతడిని కలవక పోవడంతో తిరిగి వచ్చి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని పోరుబాట పట్టారు.

- గెరిల్లా దళం ఏర్పాటు..

ఆదివాసీ గిరిజన హక్కుల కోసం పోరాడేందుకు ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో గిరిజన యువకుడిని చేరదీసి సైన్యాన్ని ఏర్పాటు చేశారు. కుమరం భీం. వెదురు కొట్టడం, విల్లంబులు, బాణాలు తయారు చేయడం వారికి నేర్పించాడు. ఉచ్చులు పెట్టడం, గెరిల్లా దాడులపై శిక్షణ ఇచ్చాడు. బర్మారా ( ఒకరకమైన నాటు తుపాకులు) ఇంటికోటి ఉండాలని చెప్పేవాడు. అరక(నాగలి), పొరక, మేకలు, కంచె, కంచెలపై ని జాం ప్రభుత్వం తరపున పట్వారీలు, చౌకీదార్లు పట్టీ లు( పన్నులు) వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వారిపై దాడులు చేసేవారు. నైజాం కాలంలో పట్టేదారులు గిరిజన మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడేవారు. ఈ క్రమంలో వారిపై కుమరం భీం దాడులు చేసేవాడు. భూస్వామి సిద్దిక్‌తో గొడవకు దిగాడు. ఈ గొడవలో సిద్దిక్‌ తీవ్రంగా గాయ పడడంతో ఈ వార్త నిజాం ప్రభువు చెవిన పడింది. దాంతో ఆగ్రో హోదగ్రుడైన నిజాం అసబ్‌జాహీ భీంను బంధించి తెమ్మంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో తన మద్దతు దారుల ఒత్తిడి మేరకు భీం అజ్ఞాత జీవితంలోకి వెళ్లారు.

- హైదరాబాద్‌ నుంచి..

కుమరం భీం బల పడితే మొత్తంగా ఈ ప్రాంతంలోనే తన అధికారానికి బీటలు వారుతాయని భయపడిన నిజాం ప్రభువు అతడిని భౌతికంగా అంత మొందించేందుకు ప్రత్యేక దళాన్ని హైదరాబాద్‌ నుంచి జోడేఘాట్‌కు పంపారు. అయితే ఆ ప్రయత్నం ఫలించక పోవడంతో కుట్ర చేసైనా ఆయనను అడ్డు తొలగించుకోవాలని ఆయన సహచరులను లోబర్చుకున్నారు. దీంతో కుమరం భీం అనుచరుడైన మడావి కొద్దు అనే వ్యక్తి 1940 అక్టోబరు 6న ఇచ్చిన సమాచారం మేరకు నిజాం ప్రభుత్వం అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున సైనికులను మోహరించి భీం సైన్యం కోసం గాలింపులు చేపట్టింది. అర్థరాత్రి భీంపై నిజాం పోలీసులు ఆకస్మిక దాడితో చుట్టు ముట్టి గుండ్ల వర్షం కురిపించారు. నిజాం పోలీసులను విరోచితంగా ఎదుర్కొని చివరకు మృత్యుదేవత ఒడిలో తుది శ్వాస విడిచారు. భీం నిజాం సైన్యం కాల్పుల్లో మరణించడంతో ఆయన అనుచరులు చెల్లా చెదరయ్యారు.

- అధికారికంగా వర్ధంతి వేడుకలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్ట మొదటి సారిగా 2014లో కుమరం భీం వర్ధంతి కార్యక్రమాన్ని అప్పటి ప్రభుత్వం అధికారికంగా చేపట్టింది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జోడేఘాట్‌కు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. దీంతో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జోడేఘాట్‌కు వచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. వర్ధంతి సందర్భంగా నిర్వహించిన దర్బార్‌లో రూ.25 కోట్లను మంజూరు చేసి జోడేఘాట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా మంగళవా రం భీం 85వ వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కుమరం భీం వర్ధంతి కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారు లు, ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 11:46 PM