Share News

బాలికల అభ్యున్నతికి..

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:41 PM

మహిళలను అన్నిరంగాల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆర్థికంగా చేయూతనందించేందుకు మహిళా సంఘాల మాదిరిగా కిశోర బాలికలకు పొదుపు సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

బాలికల అభ్యున్నతికి..

- పొదుపు సంఘాల ఏర్పాటుకు కసరత్తు

- కిశోర బాలికల వివరాల సేకరణ

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మహిళలను అన్నిరంగాల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆర్థికంగా చేయూతనందించేందుకు మహిళా సంఘాల మాదిరిగా కిశోర బాలికలకు పొదుపు సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం మహిళా స్వయం సహాయక సంఘాలు కొనసాగుతున్నాయి. ఇందులో 18-60 మధ్య వయస్సు మహిళలు సభ్యులుగా ఉంటారు. అయితే 60 ఏళ్లు దాటిన వారికి వృద్ధ మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 15-18 ఏళ్ల వయస్సు ఉన్న కిశోర బాలికలకు ప్రత్యేక సంఘాల ఏర్పాటుకు జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు.

- అధికారులు భాగస్వామ్యంతోనే...

కిశోర బాలికల సంఘాల ఏర్పాటు జిల్లా గ్రామీణాభివృద్ది, జిల్లా సంక్షేమ అధికారుల భాగస్వమ్యంతోనే చేపట్టనున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న స్వయం సహాయక సంఘాలు కార్యాచరణ ప్రారంభమైంది. వృద్ధులు, బాలికల వివరాలు క్షేత్రస్థాయిలో అధికారులు సేకరిస్తున్నారు. ఈనెల 12 నుంచి గ్రామాల్లో వివరాలు సేకరణ సిబ్బంది ప్రారంభించారు. ఈనెల 30 వరకు సర్వం సిద్ధం చేయనున్నారు. ఇప్పటివరకు వృద్ధుల సంఘాలు 240, దివ్యాంగుల సంఘాలు 156, కిశోర బాలికల సంఘాలు 171 గుర్తించారు.

- ప్రయోజనాలపై అవగాహన...

గ్రామీణ ప్రాంతాల్లో కిశోర బాలికల అభ్యున్నతికి సంఘాలు తోడ్పాటు అందిస్తాయి. ఉన్నత చదువులు, వారి కెరీర్‌లో విజయాలు సాధించడానికి అవసరమైన వాతావరణం నెలకొల్పడం పలు ఆంశాలపై వివరిస్తారు. సంఘాల ఏర్పాటుకు పూర్తిస్థాయి విఽధివిధానాలను రాష్ట్ర అధికారులు త్వరలోనే అందించనున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిస్తున్నారు. 15-18 ఏళ్ల వయస్సుగల కిశోర బాలికల వివరాలు ఆరా తీస్తున్నారు. పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, చదువు మానేసిన బాలికల వివరాలను వీవోలు, అంగన్‌వాడీ టీచర్లు సేకరిస్తున్నారు. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు.

567 సంఘాల గుర్తింపు..

- దత్తరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, ఆసిఫాబాద్‌

వృద్ధులు, దివ్యాంగులు, కిశోర బాలికలతో సంఘాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు వృద్ధులు, దివ్యాంగులు, కిశోరబాలికలతో 567 సంఘాలను ఏర్పాటు చేశాం. ఈనెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కిశోర బాలిక సంఘాల ఏర్పాటు పూర్తి విధివిధానాల ప్రకారం జరుగుతుంది. త్వరలో విధివిధానాలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

Updated Date - Sep 23 , 2025 | 11:41 PM