ఏటీసీలతో ఉపాధి అవకాశాలు
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:00 PM
ఇండస్ట్రియల్ రంగం వేగంగా మార్పు చెందుతున్న నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్ది భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) ఎంతగానో ఉపయోగపడతాయి.
- ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా కోర్సులు
- జిల్లాలో నాలుగు చోట్ల రూ. 20 కోట్లతో భవనాల నిర్మాణం
- ఇప్పటికే పూర్తయిన అడ్మిషన్లు
- నేడు జిల్లాలో నాలుగు కేంద్రాల ప్రారంభం
మంచిర్యాల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఇండస్ట్రియల్ రంగం వేగంగా మార్పు చెందుతున్న నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్ది భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) ఎంతగానో ఉపయోగపడతాయి. వివిధ ఇండస్ట్రీల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల తర్ఫీదునివ్వడమే ఏటీసీల లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఐటీఐ)లను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
- పడిపోయిన డిమాండ్...
ఒకప్పుడు ఐటీఐలో శిక్షణ పూర్తిచేస్తే తప్పనిసరిగా ఉద్యోగవకాశాలు లభించేవి. ఐటీఐ పూర్తి చేసిన వారికి ప్రత్యేక గుర్తింపు సైతం ఉండేది. పదో తరగతి పూర్తి చేసిన తరువాత వేలాది మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య వైపు వెళ్లకుండా రెండేళ్ల ఐటీఐ కోర్సుల్లో చేరేవారు. అప్పట్లో ఐటీఐల్లో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, వెల్డర్, డీజిల్ మెకానిక్ కోర్సులు అందుబాటులో ఉండేవి. ఐటీఐల్లో చేరి ఆ కోర్సులు పూర్తిచేస్తే సింగరేణి సంస్థతోపాటు విద్యుత్‌శాఖ, ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభించేవి. ముఖ్యంగా డిమాండ్ ఉన్న కోర్సులైన ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ కోర్సులు పూర్తిచేసిన వారికి వెంటనే ఉద్యోగాలు లభించేవి. మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే వేలాది మంది ఐటీఐ అభ్యర్థులు ఆయా రంగాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారు. దీంతో ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు విపరీతమైన పోటీ ఉండేది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ శిక్షణ కేంద్రాలతోపాటు ప్రైవేటు ఐటీఐలు అనేకం పుట్టుకొచ్చాయి. అంతటి నైపుణ్యం కలిగిన ఐటీఐ కోర్సులకు కాలక్రమేణా.. డిమాండ్ పూర్తిగా పడిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా వాటిలో సంపూర్ణ శిక్షణ ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా దీనికి తోడు కావడంతో ఐటీఐ కోర్సుల్లో చేరేవారి సంఖ్య క్రమేణా తగ్గుముఖం పట్టింది. విద్యార్థులకు బోధించేందుకు పూర్తిస్థాయిలో ఇన్‌స్ట్రక్టర్ల నియామకం చేపట్టకపోవడం, సొంత భవనాలు శిథిలావస్థకు చేరినా పట్టించుకోకపోవడంతో ఐటీఐలు నామమాత్రంగా మారాయి. ప్రైవేటు సంస్థల పరిస్థితి పక్కనబెడితే ప్రభుత్వ ఐటీఐలో కూడా సీట్లు పూర్తయిన దాఖలాలు అతిస్వల్పంగా ఉండేవి. దీన్ని ధృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐటీఐలను బలోపేతం చేయడం ద్వారా పూర్వవైభవానికి కృషిచేయడమేగాక విద్యార్థులకు మారిన ఇండస్ట్రియల్ రంగంలో కొత్త పోకడలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు పూనుకున్నది.
- టాటా గ్రూపుతో కలిసి...
వివిధ ఇండస్ట్రీల అవసరాలకు అనుగుణంగా, విద్యార్థులకు వంద శాతం ప్లేస్‌మెంట్స్ కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం టాటా గ్రూపుతో కలిసి ఏటీసీలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఏటీసీలుగా మార్చింది. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాకు నాలుగు ఏటీసీలు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రంతోపాటు మందమర్రి, శ్రీరాంపూర్, జన్నారంలో ప్రస్తుతం ఏటీసీలో అడ్మిషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఆధునిక హంగులతో ఏటీసీ బిల్డింగులను ఒక్కొక్కటి ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించారు. వివిధ రకాల ఆధునిక పరికరాలను అమర్చారు. ప్రతీ ఏటీసీలో మూడు కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. టాటా టెక్నాలజీస్ ఆధ్వర్యంలోనూ ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. విద్యార్థులకు శిక్షణ తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఏటీసీలో శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఆధునిక టెక్నాలజీలో భాగంగా స్కిల్ డెవల్‌మెంట్ శిక్షణ ఇస్తున్నారు. ఇండస్ట్రీల అవసరాలకు తగ్గట్లు అడ్వాన్స్‌డ్ సీఏన్‌సీ, మెషినింగ్ టెక్నీషియన్, ఆర్టీషియన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫయర్ (మెకానికల్), ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, మెకానిక్ ఎలక్ర్టిక్ వెహికల్ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, డీఆర్డీవో, ఇస్రో, బెల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలతోపాటు ప్రైవేటు రంగంలోనూ అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాలిటెక్నిక్ లెక్చరర్, ఏటీసీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకూ అవకాశం ఉంటుంది.
- నేడు భవనాల ప్రారంభోత్సవం....
జిల్లాకు మంజూరైన మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, జన్నారం ఏటీసీ భవనాలను శనివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 భవనాలకు ఒకేరోజు ప్రారంభోత్సవం చేస్తుండడం గమనార్హం. మంచిర్యాల ఏటీసీ సెంటర్‌ను అదనపు కలెక్టర్ చంద్రయ్య ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభోత్సవాలు ఉన్నందున మంత్రులు, అధికారులు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు.
విద్యార్థుల భవితకు బాటలు..
వై రమేష్, మంచిర్యాల ఏటీసీ ప్రిన్సిపాల్
ఏటీసీలు విద్యార్థుల భవితకు బంగారు బాట వేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. పారిశ్రామిక రంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఏటీసీల్లో శిక్షణ లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీల్లో బహుముఖ శిక్షణ అందించడం కోసం చొరవ తీసుకోవడం శుభపరిణామం. ఆధునిక హంగులతో భవన నిర్మాణాలతోపాటు యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.