డీసీసీ చీఫ్‌కు ఎన్నికల ’పంచాయతీ’
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:04 AM
కాంగ్రెస్ పార్టీలో నూతనంగా డీసీసీ పదవులు చేపట్టిన వారి సత్తాకు పంచాయతీ ఎన్నికలు పరీక్షగా మారాయి. బాధ్యతలు చేపట్టగానే సర్పంచ్ ఎన్నికలు రావటంతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడంతో పాటు అన్ని వర్గాలను సమన్వయం చేయడం డీసీసీ చీఫ్‌లకు సవాల్‌గా మారింది.
- ముఖ్యనేతల సహకారంపై అనుమానాలు
- పదవి చేపట్టగానే ఎన్నికలు రావడంతో ఆందోళన
మంచిర్యాల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీలో నూతనంగా డీసీసీ పదవులు చేపట్టిన వారి సత్తాకు పంచాయతీ ఎన్నికలు పరీక్షగా మారాయి. బాధ్యతలు చేపట్టగానే సర్పంచ్ ఎన్నికలు రావటంతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడంతో పాటు అన్ని వర్గాలను సమన్వయం చేయడం డీసీసీ చీఫ్‌లకు సవాల్‌గా మారింది. సీనియర్ నేతలు అనేక మంది డీసీసీ పదవిపై ఆశతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో సామాజిక సమీకరణల పేరుతో ఊహించని నేతలకు పదవిని కట్టబెట్టారు. అయితే అధ్యక్ష పదవి ఆశించిన నేతల్లోని అసంతృప్తిపై అధిష్ఠానం చర్చించకపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో వారి సహకారంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు డీసీసీ చీఫ్‌తో కలిసి పనిచేస్తారా...? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
- కొత్త అధ్యక్షుడికి తొలి పరీక్ష...
అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించింది. డీసీసీ అధ్యక్ష పదవి కోసం మంచిర్యాల జిల్లా నుంచి 29 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధిష్ఠానం సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల అధ్యక్షుడిగా పిన్నింటి రఘునాథ్ రెడ్డిలకు అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. పార్టీ అధికారంలో ఉండటంతో డీసీసీ అధ్యక్ష పదవికి ప్రాధాన్యం పెరిగింది. డీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే పంచాయతీ ఎన్నికలు రావటంతో, మెజారిటీ స్థానాల్లో గెలవటం సవాల్‌గా మారింది. ఈ నెల 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి.
- కార్యాచరణ చేపట్టని వైనం..
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో డీసీసీ అధ్యక్షులు ఇంకా పూర్తిస్థాయిలో పాల్గొనడం లేదని తెలుస్తోంది. మంచిర్యాల జిల్లాలో మాత్రం డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి ఇప్పటి వరకు గ్రామాల బాట పట్టనేలేదు. పంచాయతీ ఎన్నికల్లో తమ మార్కును చూపించి, మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను గెలుపు దిశగా పయనించేలా కార్యాచరణ చేపట్టవలసి ఉండగా, ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలేవీ జరగలేదని సమాచారం. కాంగ్రెస్ నుంచి ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలుపు బాధ్యతలను తమ భుజ స్కందాలపై వేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే డీసీసీ అధ్యక్షుడు ప్రచారంలో విరివిగా పాల్గొనడం లేదనేచర్చ నడుస్తోంది.
మంత్రి గడ్డం వివేక్ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గం నుంచే డీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగింది. మంత్రికి సన్నిహితుడు కావడంతో ఆ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడిపై పెద్దగా భారం పడే అవకాశాలులేవు. అయితే మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గంలో మాత్రం ఆయన కొత్త సవాళ్లను ఎదుర్కోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రఘునాథ్‌రెడ్డి ఇప్పటివరకు కేవలం మంత్రితోనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుతో ఆయన దూరంగా ఉంటున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటు న్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల గెలుపు బాధ్యత నూతన డీసీసీ అధ్యక్షుడిపై ఉండటంతో అగ్నిపరీక్షగా మారిందనే ప్రచారం జరుగుతోంది.