Share News

పల్లెల్లో ఎన్నికల కోలాహలం

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:50 PM

జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మొదటి విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల్లో ప్రచారం జోరందుకుంది. నామినేషన్‌ ఉపసంహకరణ ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు.

పల్లెల్లో ఎన్నికల కోలాహలం

- మొదటి విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో ఊపందుకున్న ప్రచారం

- మొదటి విడతలో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం

- రెండు, మూడో విడతకు ముగిసిన నామినేషన్ల ఘట్టం

ఆసిఫాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మొదటి విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల్లో ప్రచారం జోరందుకుంది. నామినేషన్‌ ఉపసంహకరణ ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. జిల్లాలో మూడు దఫాలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని 335 పంచాయతీలు, 2,874 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత నామినేషన్ల విత్‌డ్రా ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రెండు, మూడో విడత నామినేషన్ల స్వీకరణ గట్టం ముగియగా నామినేషన్ల ఉపసంహరణ, బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. మొదటి విడతలో ఆసిపాబాద్‌ డివిజన్‌లోని వాంకిడి, కెరమెరి, జైనూరు, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌ మండలాల్లో నిర్వహిస్తుండగా ఆయా మండలాల్లోని పంచాయతీల్లో ప్రచారం ఊపందుకుంది. రెండో విడతలో కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని బెజ్జూర్‌, చింతలమానేపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట్‌, సిర్పూర్‌-టి మండలాల్లో మూడో విడతలో కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని కాగజ్‌నగర్‌ , ఆసిఫాబాద్‌ డివిజన్‌లోని ఆసిఫాబాద్‌, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మండలాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది.

మొదటి విడతలో 576 వార్డుస్థానాలు ఏకగ్రీవం..

జిల్లాలో మొదటి విడతలో భాగంగా జైనూరు, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, కెరమెరి, వాంకిడి మండలాల్లోని 114 గ్రామ పంచాయతీలకు, 944 వార్డు స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏడు పంచాయతీ సర్పంచ్‌ స్థానాలు, 576 వార్డుస్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో లింగాపూర్‌ మండలంలోని కంచన్‌పల్లి, మామిడిపల్లి పంచాయతీలు, వాంకిడి మండలంలోని దాబా, లెండిగూడ, నవేగూడ పంచాయతీలు, కెరమెరి మండలంలో ధనోర, బాబేఝరి గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 107 గ్రామపంచాయతీల్లో 396 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 368 వార్డుల్లో 855 మంది పోటీల్లో ఉన్నారు.

రెండు సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు నిల్‌..

జిల్లాలో రెండో, మూడో విడతలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. రెండో విడత ఎన్నికల్లో కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని బెజ్జూర్‌, చింతలమానేపల్లి, దహేగాం, కౌటాల, పెంచికల్‌పేట్‌, సిర్పూర్‌-టి మండలాలలో 113 పంచాయతీలకు 737 నామియేషన్లు, 992 వార్డు స్థానాలకు 2,428 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడోవిడతలో కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ డివిజన్‌లోని ఆసిఫాబాద్‌, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో 108 పంచాయతీలకు 591 నామినేషన్లు, 938 వార్డు స్థానాలకు 2,246 నామినేషన్లు ధాఖలయ్యాయి. ఇందులో రెండు సర్పంచ్‌ స్థానాలకు ఆరు వార్డు స్థానాలకు రిజర్వేషన్‌ కేటాయించిన ప్రకారం అభ్యర్థులు లేకపోవడంతో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.

Updated Date - Dec 06 , 2025 | 11:50 PM