ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:58 PM
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అందించిన శిక్షణ కార్యక్రమానికి కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండో సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని తెలిపారు. నోటిఫికేషన్ విడుదల అయినందున ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అధికారులు తమకు ఇచ్చిన హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా చదివి ప్రతీఅంశంపై అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని తెలిపారు. మాస్టర్ ట్రైనర్లు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, నిర్వహణ ప్రక్రియలో ఏమైనా సందేహాలు, అపోహలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. న్నారు.
ముమ్మర తనిఖీలు చేపట్టాలి
- ఎస్పీ కాంతిలాల్ పాటిల్
ఆసిఫాబాద్, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రతీ ఒక్కరు కృతనిశ్చయంతో 24 గంటలు అప్రమత్తతతో విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రలజను ప్రభావితం చేయడానికి డబ్బు, మద్యం ఇతర సామగ్రి జిల్లాలోకి ప్రవేశించకుండా చెక్ పోస్టుల ద్వారా వివిధ శాఖల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడంలో కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ వాహిదుద్దీన్, విష్ణుమూర్తి, సీఐ రాణాప్రతాప్, శ్రీధర్, తదతరులు పాల్గొన్నారు.