బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:31 PM
షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ద్వారా దళితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తామని ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు.
-ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు రాంచందర్
కాగజ్‌నగర్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ద్వారా దళితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తామని ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. సోమవారం కుమురం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి సజీవన్, తహసీల్దార్ మధూకర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు మాట్లాడుతూ దళితుల భూములను ఎవరు అక్రమించకూడదని, ఆక్రమణ జరిగితే సంబంధిత దళిత బాధితులు కమిషన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ద్వారా దళితులకు సత్వర న్యాయం జరుగుతుందని, అణగారిన సంక్షేమం కోసం కమిషన్ కృషి చేస్తోందన్నారు. అణగారినవర్గాలకు ఎలాంటి అన్యా యం జరిగిన కమిషన్ సత్వరమే స్పందించి దళితుల పక్షాన అండగా నిలుస్తోందన్నారు. జిల్లానుంచి భూమికి సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయని, ఈ ప్రాంతంలో ఎక్కువగా లావుణి పట్టాలున్నందున ఇతరులు అక్రమిస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా సంబంధిత బాధితులు కమిషన్‌ను ఆశ్రయిస్తున్నట్టు వివరించారు. దళితుల సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
వినతి పత్రాల అందజేత...
కాగజ్‌నగర్‌కు ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు రాంచందర్ దళిత సంఘం వ్యవస్థాపకుడు ఈర్ల సునీల్, బెల్లంపల్లి ఏరియా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రసిడెంట్ బి గోపాలకృష్ణ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ధర్మయ్య మాదిగ కులస్థుల సమస్యలను పరిష్కారించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత సంఘం వ్యవస్థాపకుడు ఈర్ల సునీల్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ ఎస్పీఎం మిల్లులో స్థానికులకు ఉద్యోగ అవకాశాలివ్వటం లేదని, సర్‌సిల్క్ మిల్లు మూతబడిందని, యువతకు ఉపాధి మార్గాలు లేకుండా అనేక అవస్థలు పడుతున్నట్టు వివరించారు. బెల్లంపల్లి ఏరియా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రసిడెంట్ బి గోపాలకృష్ణ మాట్లాడుతూ తిర్యాణి మండలం దేవాయిగూడలో 130 మంది మాదిగ కుటుంబసభ్యులకు చెందిన భూములను సింగరేణి సంస్థ తీసుకుందని, ఇంతవరకు మాదిగలకు న్యాయం చేయటం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ మధూకర్, ఎంపీడీవో కోట ప్రసాద్, డీఎస్పీ రామానుజం, రాష్ట్ర కార్యదర్శి శనిగారం మాదిగ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వేముర్ల సంతోష్ మాదిగ, శేఖర్, ఆశోక్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.