Share News

మారుపేర్లు మారేదెన్నడో?

ABN , Publish Date - Jul 16 , 2025 | 11:37 PM

సింగరేణిలో మారుపేర్లపై విధులు నిర్వహిస్తున్న కార్మికులకు సొంత పేర్లు మారుస్తామన్న హామీ సంవత్సరాలు గడుస్తున్నా నెరవేరడం లేదు. సింగరేణి కార్మికులకు మారుపేర్ల స్థానంలో సొంత పేర్ల మార్పునకు చర్యలు చేపడతామని 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా హామీ ఇచ్చారు.

మారుపేర్లు మారేదెన్నడో?

- సింగరేణిలో ఏళ్లతరబడి కార్మిక కుటుంబాల ఎదురుచూపు

- డిపెండెంట్‌ ఉద్యోగాలపైనా తీవ్ర ప్రభావం

- గుర్తింపు సంఘంపైనే భారం

- ప్రభుత్వం పట్టించుకోవాలంటున్న కార్మికులు

మంచిర్యాల, జూలై 16 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో మారుపేర్లపై విధులు నిర్వహిస్తున్న కార్మికులకు సొంత పేర్లు మారుస్తామన్న హామీ సంవత్సరాలు గడుస్తున్నా నెరవేరడం లేదు. సింగరేణి కార్మికులకు మారుపేర్ల స్థానంలో సొంత పేర్ల మార్పునకు చర్యలు చేపడతామని 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా హామీ ఇచ్చారు. అయితే దాదాపు ఏడేళ్లు గడుస్తున్నా హామీ నెరవేరలేదు. పేర్ల మార్పిడి విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ ప్రక్రియ అంతటితోనే నిలిచిపోయింది. సింగరేణి వ్యాప్తంగా మారుపేర్లతో విధులు నిర్వహిస్తున్న వారు సుమారు 6,000 మంది వరకు ఉంటారని సమాచారం. వీరంతా విధుల్లో చేరినప్పటి నుంచి సొంత పేర్లకు నోచుకోవడం లేదు.

- నిరక్ష్యరాస్యులు కావడంతో...

సుమారు 40 సంవత్సరాల క్రితం ఉద్యోగాల్లో చేరిన వారు ఏ పేరుతో విధులు నిర్వహిస్తున్నారో కూడా తెలియని రోజులవి. దానికి తోడు అప్పట్లో అధిక శాతం మంది నిరక్షరాస్యులు సింగరేణి ఉద్యోగాల్లో చేరారు. ఎలాంటి విద్యార్హతలు లేకుండా బరువులు ఎత్తడం, పరుగు పందెంలో పాల్గొని విజయం సాధించిన వారికి సంస్థ నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సరియైన ధ్రువీకరణ పత్రాలు లేని ఆ రోజుల్లో ఉద్యోగంలో చేరే సమయంలో సింగరేణి అధికారులు కార్మికులు చెప్పిన పేర్లను నమోదు చేసుకున్నారు. అప్పట్లో గ్రామాల్లో ఇంటి పేరుతో పాటు వారు పని చేసే కులవృత్తుల పేర్లతో కూడా సంభోధనలు ఉండేవి. అలా కులవృత్తుల పేరుతో పిలవబడే వారు ఉద్యోగంలో చేరిన తరువాత గనులపై ఆ పేరే కార్మికుల ఇంటి పేరుగా స్థిరపడింది. అప్పట్లో ఇంటిపేర్లపై పెద్దగా పట్టింపులు లేకపోవడం, పైగా నిరక్షరాస్యులు కావడంతో తమ పేర్ల గురించి కార్మికులు ఏనాడూ రికార్డుల్లో పరిశీలన చేసుకోలేదు. సొంత పేర్లు రికార్డుల్లో ఎక్కించుకోవాలన్న ఆలోచన కూడా కార్మికులకు రాలేదు. దీంతో దశాబ్దాల తరబడి మారు పేర్లతోనే ఉద్యోగాలు చేస్తున్నారు.

- డిపెండెంట్‌ ఉద్యోగాలపై ప్రభావం...

మారుపేర్లతో ఉద్యోగాలు చేస్తున్న కార్మికుల పిల్లలపై దాని ప్రభావం అధికంగానే పడుతోంది. అప్పటి కార్మికుల పిల్లల్లో ఉన్నత చదువులు చదివిన వారు అనేక మంది ఉన్నారు. వారి సర్టిఫికేట్లన్నీ సొంత పేర్లతోనే ఉన్నాయి. తండ్రి ఇంటి పేరులో దొర్లిన తప్పుల కారణంగా పిల్లల చదువుల్లోనూ దాని ప్రభావం పడుతోంది. అలాగే సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలకు అవకాశాలు ఉండటంతో మారుపేర్లతో ఉన్న కార్మికుల పిల్లలు కొలువులో చేరేందుకు కూడా అడ్డంకిగా మారాయి. అనారోగ్య కారణాలతో కార్మికులు మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ అయిన సందర్భంలో తన తండ్రి పేరులో అక్షర దోషం ఉందనే సాకుతో పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి అధికారులు నిరాకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి కేసులు కొత్తగూడెం కార్పొరేట్‌ విజిలెన్స్‌ విభాగం కార్యాలయంలో 6000కు పైగా పెండింగులో ఉన్నాయి. ఈ విషయమై గతంలో పలుమార్లు అప్పటి ముఖ్యమంత్రితోపాటు సంస్థ సీఎండీ ధృష్టికి తీసుకెళ్లినా సమస్యకు పరిష్కారం లభించలేదు.

- ఏఐటీయూసీపైనే భారం...

దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందోనని వందలాది కార్మిక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ప్రాతినిథ్య సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ అయినా కార్మికుల పక్షాన నిలిచి సమస్య పరిష్కారం కోసం పోరాడాలనే విజ్ఞప్తులు సర్వత్రా వినిపిస్తున్నాయి. సింగరేణిలో మారుపేర్ల మార్పిడి జరిగితే వందలాది కార్మికుల పిల్లలకు డిపెండెంట్‌ ఉద్యోగాలు లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఈ విషయమై దృష్టి సారించి వీలైనంత త్వరగా తమ సమస్యను పరిష్కరించాలని, అలాగే రాష్ట్ర కార్మికశాఖ మంత్రిగా జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గడ్డం వివేకానంద మారుపేర్ల మార్పు కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని కార్మికులు కోరుతున్నారు.

పేర్ల మార్పిడికి కృషి...

వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు

మారుపేర్లతో సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న కార్మికుల సంఖ్య వేలల్లో ఉంది. దశాబ్దాలుగా ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. కార్మికులకు సొంత పేర్లు వినియోగంలోకి తేవాలని ఇంతకు ముందున్న సింగరేణి సీఎండీ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడున్న యాజమాన్యం కూడా స్ట్రక్చర్‌ మీటింగ్‌లో పేర్ల మార్పునకు అంగీకరించింది. ఈ విషయంలో న్యాయపరమైన సలహా కోసం యాజమాన్యం ప్రయత్నిస్తోంది. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

Updated Date - Jul 16 , 2025 | 11:37 PM