నత్తనడకన రివైజ్డ్ పీపీవో ఆర్డర్ల పంపిణీ
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:50 PM
రివైజ్డ్ పీపీవో(పెన్షన్ పేమెంట్ ఆర్డర్) పంపణీ నత్తనడకన సాగుతుండడంతో రివైజ్డ్ పెన్షన్లు అందుకునేందుకు ఎదురుచూస్తున్న సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల జీవితభాగస్వాములకు నిరాశ ఎదురవుతోంది.
- ఆందోళన వ్యక్తం చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు
శ్రీరాంపూర్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రివైజ్డ్ పీపీవో(పెన్షన్ పేమెంట్ ఆర్డర్) పంపణీ నత్తనడకన సాగుతుండడంతో రివైజ్డ్ పెన్షన్లు అందుకునేందుకు ఎదురుచూస్తున్న సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల జీవితభాగస్వాములకు నిరాశ ఎదురవుతోంది. ఆర్డర్ల పంపిణీ నత్తనడకన సాగడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంతో మంది కార్మికులు తమ కండలు కరిగించి సింగరేణి అభివృద్ధికి పాటుపడుతున్నారు. రిటైర్ అయిన తరువాత పింఛన్ స్వీకరిస్తున్నారు. ఒకవేళ వారు చనిపోతే వారి జీవిత భాగస్వాములకు 60 శాతం పింఛన్ వస్తుంది. అయితే వీటిని పొందేందుకు బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
- ఆర్డర్ ఓకే... అమలే అయోమయం
ఈ తరుణంలో త్వరగా పెన్షన్ తీసుకునేందుకు కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ అధికారులు 27 జూలై 2023న ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం త్వరగా రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పొందేందుకు విశ్రాంత ఉద్యోగుల ఆధార్ కార్డు, జీవితభాగస్వామి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్(ఫార్మర్/సర్వైవర్ మోడ్ ఖాతా), పెన్షన్ పేమెంట్ ఆర్డర్, జంటగా దిగిన భార్యాభర్తల ఫొటోలను తాము పనిచేసిన గని/విభాగం సంక్షేమాధికారులకు అందించాలని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. దీంతో సుదూర ప్రాంతాల్లో ఉన్న విశ్రాంత ఉద్యోగులు దరఖాస్తులు సమర్పించారు. కానీ ఇంతవరకు ఆర్డర్లు అందలేదు. సింగరేణివ్యాప్తంగా 40,000 మంది విశ్రాంత ఉద్యోగులకు రివైజ్డ్ పెన్షన్ ఆర్డర్లు పంపిణీ కాలేదు.
మాకు రాలేదంటే... మాకు రాలేదని...
ఇలా అందనివారు సీఎంపీఎఫ్ కార్యాలయంలో సంప్రదిస్తే తమకు డేటా రాలేదని, జీఎం కార్యాలయంలో కలిస్తే గనుల నుంచి మాకు రాలేదని, గని సంక్షేమాధికారులను అడిగితే మేము పంపామని ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. అంతేకాకుండా ఇచ్చిన దరఖాస్తులను సైతం పోగొడుతున్నారని విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణలు అనేకం ఉన్నాయి.
డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించాలి
ఈనాటి కాలంలో వెబ్‌సైట్ నుంచి ఆధార్, పాన్, లైఫ్ సర్టిఫికెట్, అనేక రకాల సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని వినియోగిస్తున్నాం. కానీ పెన్షన్ ఆర్డర్లు మాత్రం మ్యాన్‌వల్‌గా పొందాల్సి వస్తోంది. డౌన్‌లోడ్ సౌకర్యం కల్పించినట్లయితే అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆర్డర్లు పొందితే....
ఒకవేళ పెన్షనర్ మరణిస్తే రివైజ్డ్ పెన్షన్ ఆర్డర్ ప్రకారం వారి జీవితభాగస్వామికి 60 శాతం పెన్షన్ అందే అవకాశం ఉంటుంది. దీనికి కేవలం 20 రోజుల సమయం సరిపోతుంది. సమీప ఎస్‌బీఐ బ్యాంకు వారిని సంప్రదించి పెన్షనర్ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, పాస్‌పుస్తకం అందిస్తే చాలు. కానీ భర్తలు చనిపోయిన వారికి రివైజ్డ్ పెన్షన్ ఆర్డర్లు లేకపోవడంతో భార్యలకు పెన్షన్ రావడం లేదు. అధికారులు స్పందించి వెంటనే తమ దరఖాస్తులను సీఎంపీఎఫ్ కార్యాలయానికి పంపాలని కోరుతున్నారు.
దరఖాస్తు పోగొట్టారు..
- వి. లక్ష్మణాచారి, రిటైర్డ్ క్లర్కు
శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం 1ఏ గనిలో క్లర్కుగా చేసి రిటైర్ అయ్యాను. 2023 ఆగస్టులో రివైజ్డ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఆర్డర్ రావడం లేదని కార్యాలయంలో కలిస్తే దరఖాస్తు ఎక్కడో పోయిందన్నారు. మళ్లీ ఇవ్వాల్సి వచ్చింది.
దరఖాస్తు కనిపించడం లేదట..
- పి. సంపత్ కుమారచారి, రిటైర్డ్ క్లర్కు
శ్రీరాంపూర్ ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో క్లర్కుగా పనిచేసి రిటైర్ అయ్యాను. 2023 ఆగస్టులో రివైజ్డ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. జీఎం కార్యాలయంలో అడిగితే నా దరఖాస్తు పంపామన్నారు. సీఎంపీఎఫ్ ఆఫీసులో వాకబు చేస్తే నా దరఖాస్తు కనిపించడం లేదని చెప్తున్నారు.
రెండోసారి ఇచ్చాను
- గడ్డం వెంకటేశ్వర్లు, రిటైర్డ్ మైనింగ్ సర్దార్
భూపాలపల్లి ఏరియాలోని కేకే-5 గనిలో పనిచేసి రిటైర్ అయ్యాను. 2023 ఆగస్టులో రివైజ్డ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఎంతకూ రాకపోవడంతో ఈ నెల 17వ తేదీన కేకే-5 గని సంక్షేమాధికారి కార్యాలయానికి వెళ్లి కలిశాను. రెండేళ్ల క్రితం చేసుకున్న దరఖాస్తు లభించడం లేదని, మళ్లీ దరఖాస్తు ఇవ్వాలని చెప్పారు. మళ్లీ ఇచ్చి వచ్చాను.
ఇబ్బందులకు గురవుతున్నారు
- అళవందార్ వేణుమాధవ్, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి
రివైజ్డ్ పెన్షన్ కోసం 2023లో ఆర్డర్స్ వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇందులో 60 శాతానికి పైగా దరఖాస్తులు సీఎంపీఎఫ్ కార్యాలయానికి చేరడం లేదు. దీనివల్ల పెన్షనర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. సింగరేణి అధికారులకు ఇచ్చిన దరఖాస్తులను వెంటనే సీఎంపీఎఫ్ కార్యాలయానికి పంపించాలి. అక్కడ పని పూర్తయితే పెన్షనర్లకు సులభంగా పెన్షన్ లభిస్తుంది.