Share News

కంకాలమ్మ జాతరకు పొటెత్తిన భక్తజనం

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:47 PM

మండల కేంద్రంలోని కంకాలమ్మగుట్టపై నిర్వహించిన కంకాలమ్మ జాతరలో భక్తజనం పొటెత్తారు. దీంతో కౌటాల మండల కేంద్రమంతా జనసంద్రమైంది. ఎటుచూసినా భక్తులు అమ్మవారి దర్శనం కోసం కంకలమ్మ గుట్ట వైపే చేరుకోవడం కనిపించింది.

కంకాలమ్మ జాతరకు పొటెత్తిన భక్తజనం
భక్తజన సంద్రమైన కంకాలమ్మ గుట్ట

- ఇతర రాష్ట్రాల నుంచి రాక

- పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ

- జనసంద్రమైన కౌటాల

కౌటాల, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కంకాలమ్మగుట్టపై నిర్వహించిన కంకాలమ్మ జాతరలో భక్తజనం పొటెత్తారు. దీంతో కౌటాల మండల కేంద్రమంతా జనసంద్రమైంది. ఎటుచూసినా భక్తులు అమ్మవారి దర్శనం కోసం కంకలమ్మ గుట్ట వైపే చేరుకోవడం కనిపించింది. ఎంతో పురాతమైన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 24 సంవత్సరాలుగా మహాజాతర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించిన జాతర మహోత్సవానికి భక్తులు భారీ ఎత్తన తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు దీపారాధనతో మొదలైన జాతర ప్రముఖులు, స్వామిలతో పోటెత్తింది. ఆలయ కమిటీ చైర్మన్‌ సుల్వకనయ్య, కళ్యాణిల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరలో పాల్గొన్న భక్తులు తిరుమల తిరుపతి నుంచి వచ్చిన అక్షింతలు, పసుపు కుంకుమ, కంకణాలు పంపిణీ చేశారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు..

కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో జాతర సందడిగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గుట్టలపై అమ్మవారికి నైవేద్యం వండి సమర్పించారు.

అలరించిన శివసత్తుల పూనకాలు..

కంకలమ్మ జాతర ప్రత్యేకత శివసత్తులు పూనకాలు చూరపులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గుట్టపైకి వచ్చే ప్రముఖులను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శివసత్తులు మండల కేంద్రంలోని ప్రధాన వీధులగుండా భాజాభజంత్రీలతో నృత్యాలు చేస్తూ బోనాలు సమర్పించారు.

పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ..

జాతర సందర్భంగా కంకలమ్మ అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రామనాథంతో పాటు ఉమ్మడి జిల్లా టీటీడీ ప్రచారక్‌ గుల్లపల్లి సత్యనారాయణ, సభ్యులు చంద్రశేఖర్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, తహసీల్దార్‌ ప్రమోద్‌కుమార్‌ దంపతులు తదితరులు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌..

కంకలమ్మ జాతరను పురస్కరించుకుని కుమరం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే కుటుంబ సభ్యులతో తరలి వచ్చి పూజలు నిర్వహించారు. అలాగే కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు.

గట్టి బందోబస్తు..

అశేష జనవాహిని తరలివచ్చిన జాతర కోసం పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదుద్దీన్‌ ఆధ్వర్యంలో కౌటాల సీఐ సంతోష్‌, ఎస్సైలు చంద్రశేఖర్‌తో పాటు సిర్పూర్‌(టి), చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచికలపేట, దహెగాం, కాగజ్‌నగర్‌ రూరల్‌ ఎస్సైలతో పాటు 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Nov 16 , 2025 | 11:47 PM