అభివృద్ధే ప్రధాన ఎజెండా
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:30 PM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారు 200 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
- నేడు జిల్లాలో ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రుల పర్యటన
- రూ. 200 కోట్ల పైచిలుకు విలువైన పనులకు శంకుస్థాపన
- ఏర్పాట్లను పర్యవేక్షించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్
మంచిర్యాల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారు 200 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా అభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు,రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణరావులు తరలిరానున్నారు. ఇప్పటికే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావుతో పాటు జిల్లా అధికారులు పలుమార్లు సభాస్థలి, ఇతర ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన విజయవంతం కోసం ఎమ్మెల్యేతో పాటు అధికారులు కృషి చేస్తున్నారు.
శంకుస్థాపనలు ఇలా...
ఆదివారం ఉదయం 11 గంటలకు ఇటీవల ఆధునికీకరించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాన్ని డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రారంభించనున్నారు. అనంతరం లక్షెట్టిపేటలోనే ప్రభుత్వ పాఠశాల, కాలేజీను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1.15గంటలకు దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లిలో మూడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయబోయే ఇందిరా మహిళాశక్తి సోలార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు అనంతరం అక్కడే పెద్దఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తుండగా డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు హాజీపూర్ మండలంలోని గుడిపేట మెడికల్ కాలేజీని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. సాయంత్రం 4.15గంటలకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో సుమారు 200ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఇండస్ర్టియల్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం ఆరు గంటలకు జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో రూ.78కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే లక్షెట్టిపేట బైపాస్ రోడ్డుకు సైతం శంకుస్థాపన చేయనుండగా ఏర్పాట్లన్ని దాదాపుగా పూర్తి అయ్యాయి.
డిప్యూటీ సీఎం టూర్ షెడ్యూల్ ఇలా...
మంచిర్యాల నియోజకవర్గంలో ఆదివారం పర్యటించబోయే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క టూర్ షెడ్యూల్ ఇలా ఉంది. ఉదయం 8.30గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌లోని ప్రజాభవన్ నుంచి బయలు దేరుతారు. మధ్యాహ్నం 12గంటలకు లక్షెట్టిపేట చేరుకొని అక్కడ అధికారులతో సమావేశమవుతారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హైస్కూల్‌ను సందర్శించి అక్కడి విద్యార్థులతో మమేకం కావడంతో పాటు విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు దండేపల్లి మండలం చేరుకొని రెండు గంటలకు ఇందిరా మహిళా శక్తి సోలార్ పైలెట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన, మూడు గంటలకు బహిరంగ సభలో మాట్లాడుతారు. నాలుగు గంటలకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో ఇండస్ర్టియల్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు ప్రజా భవన్‌కు చేరుకుంటారు.
ఉపముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం జరగనున్న ఉపముఖ్యమంత్రి మల్టు భట్టి విక్రమార్క, పలువురు మంత్రుల పర్యటనను పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో డీసీపీ భాస్కర్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం మంచిర్యాల నియోజక వర్గంలో పలు శంకుస్థాపనలతోపాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, సూపర్ స్పెసాలిటీ ఆసుపత్రి, మాతా శిశు కేంద్రాన్ని సందర్శిస్తారని తెలిపారు. పోలీసు శాఖ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలన్నారు. రోడ్లకు మరమ్మతులు చేయించాలని, మంత్రులు పర్యటించే మండలాల్లో నీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిరంతర విద్యుత్ సరఫరా, లైట్ల నిర్వహణ చేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.